Karimnagar Politics: కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ-filling up of nominated posts which is creating a stir in karimnagar district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Politics: కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ

Karimnagar Politics: కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ

HT Telugu Desk HT Telugu
Oct 08, 2024 12:59 PM IST

Karimnagar Politics: రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవడం లేదా?... కరీంనగర్ జిల్లాలో ఆయనకు చెక్ పెట్టే కుట్ర జరుగుతుందా?.. అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఔననే సమాధానం వస్తుంది.

నామినేటెడ్ పదవుల భర్తీలో పొన్నం ప్రభాకర్ ప్రభావం ఎంత?
నామినేటెడ్ పదవుల భర్తీలో పొన్నం ప్రభాకర్ ప్రభావం ఎంత?

Karimnagar Politics: తెలంగాణలో పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రిగా పొన్నం ప్రభాకర్ కొనసాగుతుండడంతో జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు నామినేటెడ్ పోస్టులు లభిస్తాయని గంపెడు ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో ఒక్కటి కూడా మంత్రి అనుచరులకు, ఆయన ప్రతిపాదించిన వారికి దక్కడంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.‌ తాజాగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సత్తు మల్లయ్యను ఎంపిక చేయడంతో పదవులు ఆశించిన వారు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.

కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా చొప్పదండి నియోజకవర్గానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లయ్యను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అనుచరునిగా ముద్ర పడిన సత్తు మల్లయ్య మంత్రి సీతక్కకు సన్నిహితునిగా ముద్ర పడ్డారు.

రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో సత్తు మల్లయ్యను స్వంత జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియామకం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్దుబాటు చేశారంటూ పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అంతర్గతంగా ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు కరీంనగర్ జిల్లాకు మూడు నామినేటెడ్ పోస్టులు లభించగా అందులో మంత్రి పొన్నం అనుచరులకు ఒక్కటి కూడా దక్కలేదు.

మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఎంపికైన నేరెళ్ల శారద, కరీంనగర్ సుడా చైర్మన్ గా నియమితులైన కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇద్దరు వ్యక్తిగత ఇమేజ్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనతోనే వారికి ఆ పదవులు లభించినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది.

పొన్నం అనుచరులకు షాక్…

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి మంత్రి పొన్నం అనుచరులు తీవ్రంగా పోటీపడ్డారు. సుడా చైర్మన్ నియామకం మంత్రి పొన్నంకు సమాచారం లేకుండా జరిగినందున జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఆయన సూచన మేరకే కట్టబెడతారనే ఆశాభావంతో పలువురు నేతలు మంత్రికి దరఖాస్తు చేసుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు.

పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజనీకుమార్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్, డీసీసీ బీసీ సెల్ చైర్మన్ పులి అంజనేయులు గౌడ్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున రాజేందర్ సహా పలువురు నేతలు ఈ పదవిని ఆశిస్తూ గుట్టుచప్పుడు కాకుండా. తమవంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. తమకే ఈ పదవి ఖాయమని లెక్కలు వేసుకుంటున్న తరుణంలో సైలెంట్ గా ఉత్తర్వులు వెలువడటం .. చొప్పదండి నియోజకవర్గానికే మరో నామినేటెడ్ పదవి దక్కడం మంత్రి పొన్నం అనుచరులకు షాక్ ఇచ్చినట్లు అయింది.

సీఎం అనుచరుడు సత్తు…

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలైనా ఒక్క సుడా చైర్మన్ మినహా మరో నియామకం జరగలేదంటూ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ప్రకటించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ల జాబితాలో కరీంనగర్ జిల్లాకు చోటు దక్కింది. చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మలయ్యను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

టీడీపీలో ఉన్న నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి శిష్యుడిగా సత్తు మల్లయ్య ముద్రపడ్డారు. రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరిన సత్తు మల్లయ్య పీసీసీ అధ్యక్షునిగా నియామకమైన తర్వాత తన కమిటీలో కీలకమైన పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా కట్టబెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా రేవంత్ రెడ్డి కోటరీలోనే కొనసాగుతూ పార్టీ పరంగా అనేక కార్యక్రమాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. రేవంత్ రెడ్డి సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత సత్తు మల్లయ్య ఆయన వెంట నడిచారు.

ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కార్యాలయం ఆదేశాల మేరకు పని చేస్తూ పోయారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత బృందంలో ఒకరిగా గుర్తింపు పొందారు. టీడీపీ హయాం నుంచి కూడా వారిద్దరి మధ్య బంధం అలాగే కొనసాగుతూ వచ్చింది. అయితే జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోకుండా చివరి నిముషంలో ఆయనకు ఓ మాట చెప్పి సత్తు మల్లయ్యను గ్రందాలయ సంస్థ చైర్మన్ గా నియమించినట్లు ప్రచారం జరుగుతుంది.

ఇద్దరు ఎమ్మెల్యేలు లేఖలు…

మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,. మేడిపల్లి సత్యం ఇద్దరు సత్తు మలయ్యకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ప్రతిపాదిస్తూ లేఖలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే కావడంతో సత్తు మల్లయ్యకు లైబ్రరీ చైర్మన్ పదవి ఖరారు చేయడం వెనుక సీఎం సన్నిహితులు కసరత్తు చేశారని సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ కు చివరి నిముషంలోనే సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి నివాసంలో ముఖ్య‌నేతలందరూ సమావేశమై ఈ నియామకం గురించి తీవ్ర స్థాయిలో చర్చించారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

గ్రంథాలయం పదవి చొప్పదండి సొంతం..

కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి నాటి నుంచి నేటి వరకు చొప్పదండి నియోజకవర్గానికే దక్కుతుంది. గ్రంథాలయ సంస్థ పదవికి చొప్పదండి నియోజకవర్గానికి అవినాభావ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. చొప్పదండి ఎమ్మెల్యేగా పని చేసిన కొడూరి సత్యనారాయణగౌడ్ గతంలో కాంగ్రెస్ హయాంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేశారు.

తెలుగుదేశం హయాంలో బోనాలపల్లెకు చెందిన బోనాల రాజేశం, టీఆర్ఎస్ హయాంలో ఏనుగు రవీందర్ రెడ్డి, రామడుగు మండలానికి చెందిన పొన్నం అనిల్ గౌడ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేశారు. తాజాగా చొప్పదండి మండలం కొలిమికుంటకు చెందిన సత్తు మల్లయ్యను గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియామయం కావడంతో గ్రంథాలయ సంస్థ పదవి చొప్పదండి నియోజకవర్గానికే సొంతం అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner