BC Caste Census : కేసీఆర్.. వెంటనే కుల గణన చేపట్టండి : పొన్నం ప్రభాకర్
BC Caste Census : రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
BC Caste Census: బిహార్ మాదిరిగానే రాష్ట్రంలోనూ ప్రభుత్వం, కుల గణన చేపట్టాలని... బలహీన వర్గాల లెక్కలు తేల్చి.. వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని... కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ కోరారు. కేంద్రం కులాల వారీగా జనాభా లెక్కలు తేల్చాలని అన్ని రాష్ట్రాలు ఒత్తిడి చేస్తున్నాయని... అయితే అందరికంటే ముందే సీఎం కేసీఆర్ ఈ అంశంపై 2021, సెప్టెంబర్ లో అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. దానికి అనుగుణంగా.. రాష్ట్రంలో కుల గణన నిర్వహణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు.. పొన్నం ప్రభాకర్.. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
"తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సామాజిక న్యాయం, స్వయం పాలన, ఆత్మగౌరవం కోసం సాగింది. సబ్బండ కులాల ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఇది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, వైద్య, విద్యా రంగాలలో అందరికీ తమ హక్కుల మేర వాటా దక్కాలి. మన రాష్ట్రంలో సగానికంటే ఎక్కువ జనాభా వెనుకబడిన తరగతుల వారే ఉన్నారు. ఈ విషయం ప్రభుత్వం చేపట్టిన సకల జనుల సర్వే ద్వారా వెల్లడైంది. అయితే.. ఆయా సామాజిక వర్గాలకు నిష్పత్తి ప్రకారం ప్రభుత్వ ఫలాలు అందడం లేదు. అర్హుల ఎంపిక సరైన విధానంలో జరగడం లేదు. సరైన లెక్కలు లేనందు వల్ల సామాజిక వర్గాలకు రావాల్సిన నిర్దిష్ట వాటా ఎంత అన్నదానిపై స్పష్టత లేదు. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎంతనేది జన గణనతో పాటు లెక్కలు సేకరిస్తున్నారు కాబట్టి వారికి రాజ్యాంగపరంగా దక్కాల్సినవి దక్కుతున్నాయి. కానీ మిగిలిన సామాజిక వర్గాల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు" అని పొన్నం లేఖలో పేర్కొన్నారు.
12 కోట్లకు పైగా జనాభా ఉన్న బిహార్ లో కులాల వారీగా జన గణనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చర్యలు చేపట్టారని.. తద్వారా వెనకబడిన వర్గాల జనాభాను గుర్తించడానికి వీలవుతుందని పొన్నం చెప్పారు. ఇదే విషయమై అందరి కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిందని.. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్ల వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక విషయాల్లో దేశానికి తమ పాలన ఆదర్శమని చెప్పే సీఎం కేసీఆర్.. కుల గణన చేసి మరింత ఆదర్శవంతంగా నిలబడతారని ఆశిస్తున్నామన్నారు. గతంలో సకల జనుల సర్వే చేసిన అనుభవం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది కనుక.. తక్కువ వ్యవధిలో కుల గణన కూడా పూర్తి చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్రం చేస్తుందని వారిపై నెట్టివేయడం సరికాదని... వారు చేస్తారన్న నమ్మకం తమకు లేదని స్పష్టం చేశారు. బిహార్ మాదిరిగానే తెలంగాణలోను కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టి .. ఈ అంశంలో కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.