Khammam DSC Teachers : విధుల్లో చేరారు... ఇంతలోనే ఆ టీచర్లను తొలగించారు..! బాధ్యులెవరు..?
ఖమ్మం జిల్లాకు చెందిన ఏడుగురు డీఎస్సీలో ఉద్యోగం సాధించారు. 24 రోజులుగా విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. సీన్ కట్ చేస్తే మీ ఉద్యోగ అర్హతలు సరిగా లేవని… నియాకాలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పరిణామంతో కొత్త టీచర్లు షాక్ కు గురయ్యారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కొత్తగా ఉద్యోగం సాధించామన్న సంతోషం రోజుల వ్యవధిలోనే ఆవిరైపోయింది. బంధువులు, సన్నిహితులతో పంచుకున్న ఆ ఆనందం పట్టుమని నెల రోజులైనా లేకుండా పోయింది. మరో వారం రోజుల్లో జీవితంలో మొట్ట మొదటిసారిగా ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నామనే సంతోషంలో ఉండగానే వారి ఆశలు అడియాశలయ్యాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న 24 రోజుల్లోనే అసలు ఆ ఉద్యోగాలకు మీరు అర్హులే కాదంటూ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వారి ఉద్యోగాలను తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. జిల్లా విద్యాశాఖ తీరు ఏడుగురు ఉపాధ్యాయుల జీవితాలను రోడ్డుపాలు చేసింది.
ఆ ఏడుగురు ఉపాధ్యాయులు గత 24 రోజులుగా వారికి కేటాయించిన పాఠశాలల్లో ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉంటున్నారు. ప్రతిరోజులాగానే గురువారం పాఠశాలకు వెళ్లగా వారి స్థానంలో వేరొక ఉపాధ్యాయుడు ఉండటం చూసి అవాక్కయ్యారు. ఇదేమిటని ప్రశ్నించగా మీరు ఈ ఉద్యోగానికి అనర్హులు అంటూ టర్మినేషన్ లెటర్ చేతిలో పెట్టారు. అది చూసి లబోదిబోమంటూ జిల్లా కేంద్రం ఖమ్మంలోని ఐడిఓసిలో ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి ఆ బాధిత ఉపాధ్యాయులు పరుగులు పెట్టారు.
తీరా అక్కడికి వెళ్లేసరికి చావు కబురు చల్లగా చెప్పారు. మీరు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడే తప్పుగా దరఖాస్తు చేసుకున్నారని, మీరు అసలు అర్హులే కాదంటూ తేల్చి చెప్పారు. ఉద్యోగం సాధించాలంటే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా విద్యార్హతలు ఉండాలని చెప్పకనే చెప్పారు. అందుకు తగిన విధంగా మీ సర్టిఫికెట్లు లేవని సెలవిచ్చారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో జరిగిన పొరపాటు వల్లే ఈ తప్పిదం జరిగిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ. ఆ మాటలు విన్న ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఒక్కొక్కరు తమ ధీన గాధలను వినిపిస్తూ బోరుమన్నారు.
ఆశపెట్టి ఉద్యోగంలోకి తీసుకొని, అధః పాతాళానికి తొక్కారని వాపోయారు. నిజంగా తాము అర్హులం కాకపోతే వెరిఫికేషన్ సమయంలోనే చెప్పాల్సిందని అన్నారు. తీరా 24 రోజులు ఉద్యోగం చేసిన తర్వాత మొదటి సాలరీ అందుకుంటామన్న ఉత్సాహంతో ఉన్న తమకు పిడుగుపాటు లాంటి వార్త చెప్పడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
సైలెంట్ గా క్లోజ్ చేద్దామనుకున్నారా..?
ఏడుగురు ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగించిన ఉదంతం బయటి ప్రపంచానికి తెలియకుండా సైలెంట్ గా విషయాన్ని క్లోజ్ చేద్దామని భావించారు విద్యాశాఖ అధికారులు. ఉపాధ్యాయులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే వారి ప్లేస్ లలో ఇతర అర్హులకు తీసుకువచ్చి ఉంచారు.
ఉదయం పాఠశాలకు వెళ్లగానే టర్మినేషన్ లెటర్ ఈ ఏడుగురు బాధిత ఉపాధ్యాయుల చేతిలో పెట్టారు. ఇది ముమ్మాటికి డీఈఓ తప్పిదంగానే భావించాల్సి వస్తుంది. అసలు వెరిఫికేషన్ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా ఏడుగురి జీవితాలను రోడ్డున పడేయటం ఆయన నిర్లక్ష్యపు వైఖరిని తేటతెల్లం చేస్తోంది. ఇప్పటికే డీఎస్సీలో నాన్ లోకల్ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించారని అపవాదులు మూటగట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో కొత్త వివాదం తెరమీదకి రావడం విచారకరం.
ఖమ్మం జిల్లాలో డీఎస్సీ నియామకాల నేపథ్యంలో నాన్ లోకల్ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించిన సంఘటనపై ఆరోపణ రావడంతో విచారణ కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగానే గురువారం ఏడుగురి ఉపాద్యాయులను తొలగించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు విద్యారంగం పరంగా ఎంతో మంచి పేరు ఉంది. అలాంటి జిల్లా పరువును రాష్ట్రవ్యాప్తంగా తీయడంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంతో కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనిపై జిల్లా మంత్రులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బాధిత ఉపాధ్యాయులు వీరే..
1.మాయరి నాగేశ్వర్ రావు
హింది పండిట్
మధిర సీపీఎస్ పాఠశాల
2.సట్టు రామలింగయ్య
బనిగండ్లపాడు
హిందీ పండిట్
3.షేక్ నాగుల్ మీరా
హిందీ పండిట్
వేంసూర్ మండలం కందుకూరు zphs పాఠశాల
4.దోర్నాల లావణ్య
హిండిపండిట్
మధిర మండలం చిలుకూరు zphs పాఠశాల
5.తాటికొండ నాగలక్ష్మి
హిందీ పండిట్
కూసుమంచి మండలం పాలేరు zphs పాఠశాల
6.తాటికొండ శ్రీదేవి
హిందీ పండిట్
ఎర్రుపాలెం మండలం zphs రేమిడిచర్ల...
7.మొండేటి వెంకట రత్నం
హిందీ పండిట్
కొణిజర్ల మండలం తుమ్మలపల్లి zphs పాఠశాల.