Dasara liquor: దసరా మత్తు రూ. 166 కోట్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం విక్రయాల జోరు-dussehra liquor sales for rs 166 crores sales of liquor in the joint karimnagar district are booming ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dasara Liquor: దసరా మత్తు రూ. 166 కోట్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం విక్రయాల జోరు

Dasara liquor: దసరా మత్తు రూ. 166 కోట్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం విక్రయాల జోరు

HT Telugu Desk HT Telugu
Oct 16, 2024 05:14 AM IST

Dasara liquor: కరీంనగర్‌లో దసరా పండుగకు మద్యం జోష్ దద్దరిల్లింది. చిన్న పెద్ద తేడా లేకుండా మద్యం మత్తులో ఊగారు. రోజు 14 కోట్ల విలువ గల మద్యాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు తాగేశారు. గత ఏడాదితో పోల్చితే 27 కోట్ల మద్యాన్ని అదనంగా ఈసారి తాగారు. మద్యం తాగడంలో కొత్త రికార్డు సృష్టించారు.

కరీంనగర్‌లో దసరా పండక్కిరికార్డు స్థాయి మద్యం విక్రయాలు
కరీంనగర్‌లో దసరా పండక్కిరికార్డు స్థాయి మద్యం విక్రయాలు

Dasara liquor: తెలంగాణలో మహిళలకు పూల పండుగ బతుకమ్మ అతిపెద్ద పండుగ అయితే మగవాళ్ళకు అందులో మందుబాబులకు దసరా పండుగ అత్యంత పెద్ద పండుగగా జరుపుకుంటారు. దసరా అంటే మగవారికి తాగి ఊగడమన్నట్లు మారింది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి దసరా కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి.

గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 282 వైన్ షాప్ లతో పాటు 54 బార్ల ద్వారా రూ.139 కోట్ల విలువ గల మద్యం విక్రయాలు జరిగితే ఈ సారి రూ.166 కోట్లు వ్యాపారం సాగింది. గతేడాదితో పోల్చితే రూ.27 కోట్ల అధికంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన లక్ష్యం రూ.165 కోట్లు కాగా లక్ష్యాన్ని మించి మద్యం విక్రయాలు జరగడంతో ఎక్సైజ్ అధికారులే ఆశ్చర్యపోతున్నారు.

కరీంనగర్ లోనే ఎక్కువ..

దసరా పండుగ సందర్భంగా ఈసారి కరీంనగర్లో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. కరీంనగర్ జిల్లాలో 94 మద్యం షాపులు ఉండగా 46 కోట్ల వ్యాపారం జరిగింది. ఏ విధంగా పెద్దపల్లి జిల్లాలో 77 వైన్ షాప్ లు ఉండగా 39 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగాయి.

జగిత్యాల జిల్లాలో 63 మద్యం షాపులు ఉండగా 41 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం, సిరిసిల్ల జిల్లాలో 48 మద్యం షాప్ లు ఉండగా 34 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈసారి ఎక్సైజ్ అధికారులు దసరా పండుగ సందర్భంగా 20 రోజుల ముందుగానే దసరా పండుగ లక్ష్యాన్ని విధించి పూర్తి చేయాలని ఆదేశించారు. లక్ష్యాన్ని పండుగకు రెండు రోజుల ముందే పూర్తి చేశారు. జనాభా ప్రాతిపదికన మద్యం షాప్ లు ఏర్పాటు చేసి ఎక్కువ వ్యాపారం చేశారు. మద్యం షాప్ ల ద్వారా కాకుండా ఉమ్మడి జిల్లాలో ఉన్న 54 బార్ల ద్వారా మరో రూ.6 కోట్ల వ్యాపారం సాగింది.

మద్యం మత్తులో గొడవలు..

ముద్యం మత్తులో మందుబాబులు చెలరేగిపోయారు. పలుచోట్ల ప్రమాదాలకు గురయ్యారు. ఉమ్మడి జిల్లాలో మద్యం మత్తులో బైక్ పై స్పీడ్ గా వెళ్ళి ప్రమాదాలకు గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు కేసుల పాలయ్యారు. పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖనిలో మద్యం మత్తులో యువకులు ఘర్షణ పడ్డారు. సింగరేణి గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మందుబాబులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో ఘర్షణ పడ్డారు.

జనం మద్య ఘర్షణ పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసుల తొమ్మిది మంది యువకులను గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. అటు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల లో ఘర్షణ పడ్డ ఐదుగురిపై కేసు నమోదు చేశారు. జగిత్యాల వాణి నగర్ లో ఇంటిపై మందుబాబులు దాడి చేశారు. ఇద్దరు మహిళలతో పాటు నలుగురు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి మందుబాబులకు మత్తు వదిలేలా చర్యలు చేపట్టారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner