Congress: నామినేటెడ్ పోస్టులపై సీనియర్లు గరంగరం.. పెండింగ్‌లో ఉత్తర్వులు-dissatisfaction of telangana congress senior leaders over nominated posts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress: నామినేటెడ్ పోస్టులపై సీనియర్లు గరంగరం.. పెండింగ్‌లో ఉత్తర్వులు

Congress: నామినేటెడ్ పోస్టులపై సీనియర్లు గరంగరం.. పెండింగ్‌లో ఉత్తర్వులు

HT Telugu Desk HT Telugu
Aug 27, 2024 08:03 AM IST

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టులు చిచ్చుపెట్టాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పోస్టులు ఇవ్వడంతో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా ఓ మంత్రి ఏఐసీసీ నాయకత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు ఈ ఇష్యూ కాంగ్రెస్‌లో కాక రేపుతోంది.

గుత్తా అమిత్ రెడ్డి
గుత్తా అమిత్ రెడ్డి

రాష్ట్ర కాంగ్రెస్‌లో ముసలం మొదలైనట్లే కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై.. రాష్ట్ర మంత్రి ఒకరు ఏఐసీసీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఏరి కోరి భర్తీ చేసిన రెండు నామినేటెడ్ పదవులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పదవులు ఇచ్చి వారం కావొస్తున్నా.. ఆ ఇద్దరు నేతలు ఇంకా బాధ్యతలు చేపట్టలేకపోయారు.

ఏఐసీసీకి ఫిర్యాదు..

నామినేటెడ్ పదవుల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న సీనియర్లను కాదని.. ఎన్నికల ముందో, తర్వాతో వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారన్న ప్రశ్నలు వచ్చాయి. దీనిపై కేబినెట్‌లో కీలక మంత్రి ఒకరు ఏఐసీసీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో నామినేటెడ్ పోస్టుల వ్యవహారానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. కొందరు సీనియర్లనూ కలుపుకొని మరొకొన్ని పోస్టులు భర్తీ చేసే వరకు.. బాధ్యతలు తీసుకోవద్దని పెండింగులో పెట్టారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

అసలు ఏం జరిగింది..?

గతేడాది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే.. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ అనుమానించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా తామే తిరిగి అధికారంలోకి వస్తామంటూ కామెంట్స్ చేసింది. దీంతో రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌ మొదలు పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకున్నారు. అలా తీసుకున్న నాయకులకు ముందే పదవుల హామీ కూడా ఇచ్చారు.

పోచారం.. గుత్తా..

బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిలో ముఖ్యులు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఈనెల 20న పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా.. గుత్తా అమిత్ రెడ్డిని తెలంగాణ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు..

వీరిద్దరికీ పదవులు ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటి నుంచో పనిచేసిన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై ఓ మంత్రి ఏఐసీసీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారని తెలిసింది. పోచారం, గుత్తా ప్రమాణస్వీకారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

సీనియర్లను కాదని జూనియర్‌కు పదవా..?

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో సీనియర్ నాయకులకు ఇంకా ఎలాంటి నామినేటెడ్ పదవులు దక్కలేదు. లోక్ సభ ఎన్నికల ముందే పార్టీలో చేరిన గుత్తా అమిత్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమతమ నేతల వద్ద ఫిర్యాదు చేశారు. సీనియర్లను కాదని.. నిన్నమొన్న పార్టీలో చేరిన వారికి పదవి ఇవ్వడం అంటే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టేనని.. స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న తరుణంలో పార్టీకి ఇది ఏ మాత్రం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా పదవులు రాలేదు..

జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులకు ఎవరికీ పదవులు దక్కలేదు. జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ గెలుపు కోసం పనిచేసిన నాయకులకు పదవులు ఇచ్చేదాకా.. బాధ్యతల స్వీకరణ పెండింగ్‌లో పెట్టాలని సూచించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

( రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి )