KTPS Cooling Towers: భద్రాద్రి జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌ కూలింగ్ టవర్స్ కూల్చివేత-demolition of cooling towers of palvancha ktps bhadradri district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktps Cooling Towers: భద్రాద్రి జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌ కూలింగ్ టవర్స్ కూల్చివేత

KTPS Cooling Towers: భద్రాద్రి జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌ కూలింగ్ టవర్స్ కూల్చివేత

HT Telugu Desk HT Telugu
Aug 05, 2024 12:40 PM IST

KTPS Cooling Towers: ద్రాద్రి జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూల్చివేశారు.

కాలం చెల్లిన  భద్రాద్రి కేటీపీఎస్‌ కూలింగ్ టవర్ల కూల్చివేత
కాలం చెల్లిన భద్రాద్రి కేటీపీఎస్‌ కూలింగ్ టవర్ల కూల్చివేత

KTPS Cooling Towers: భద్రాద్రి జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ విద్యుత్ కర్మాగారంలో 8 కూలింగ్ టవర్లను సోమవారం అధికారులు ఒకేసారి నేలమట్టం చేశారు.

కాలం చెల్లిన కారణంగా ఈ టవర్లను కూల్చివేశారు. కేటీపీఎస్ లోని బాయిలర్, టర్బైన్లను తొలగించిన తర్వాత ఇంప్లోజన్ పద్దతిలో 20 కేజీల పేలుడు పదార్థాలను అమర్చి కూలింగ్ టవర్లను కుప్ప కూల్చారు.

1965-67 మధ్య కాలంలో నిర్మించిన ఈ కూలింగ్ టవర్లు ఆరు దశాబ్దాల కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు నింపడంలో కీలక పాత్ర పోషించాయి. విద్యుత్ కర్మాగారంలో బొగ్గును మండించినప్పుడు ఉత్పత్తి అయ్యే వేడిని అదుపు చేసేందుకు ఈ కూలింగ్ టవర్లు సహకరిస్తాయి.

103 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ టవర్లు పాల్వంచ పట్టణానికే తలమానికంగా ఉండేవి. దేశంలోనే ఎత్తైన టవర్లుగా చరిత్రలో నిలిచిన ఈ టవర్లను నిర్మించడానికి సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లో ఎందరో కార్మికులు శ్రమించారు.

నోయిడాలో టవర్లను కూల్చిన సంస్థ..

ఢిల్లీలో నోయిడా టవర్లను కూల్చి వేసిన సంస్థ కేటీపీఎస్ లోని ఎనిమిది కూలింగ్ టవర్లను ఒకేసారి కూల్చి వేసింది. దేశ చరిత్రలో ఇది అరుదైన ఘటనగా అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా కూల్చివేయదలచుకున్న నిర్మాణం వరకే కూల్చివేస్తారు.

ఇంప్లోజన్ పద్దతిలో 20 కేజీల ఎక్స్ ప్లోజివ్స్ ను ఉపయోగించి ఈ టవర్లను నేలమట్టం చేశారు. ఆకాశమంత ఎత్తులో పదుల సంవత్సరాలుగా పాల్వంచ పట్టణ ప్రజల కళ్ళకు కనిపించిన టవర్లు కూల్చి వేస్తున్న దృశ్యాలను తిలకించేందుకు ప్రజలు తండోపతండాలుగా కదిలి వచ్చారు.

పాల్వంచ కేటీపీఎస్ లో 120 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. కర్మాగారంలో విద్యుత్ ఉత్పత్తి క్రమంలో 6 దశాబ్దాలుగా సేవలందించిన ఈ టవర్లను కూల్చి వేయడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)