Congress Jana Garjana: ఖమ్మం గడ్డపై 'జన గర్జన' - కాంగ్రెస్ లో చిగురిస్తున్న ఆశలు!
Congress Telangana Jana Garjana: ఖమ్మం వేదికగా భారీ సభకు సర్వం సిద్ధమవుతోంది. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్… చేరికలపై దృష్టిపెట్టింది. తెలంగాణ జన గర్జన వేదికగా పొంగులేటితో పాటు పలువురిని పార్టీలోకి ఆహ్వానించనుంది.
Telangana Congress: మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో ఎన్నికల సమరం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఆ మూడ్ లోకి వెళ్లాయి. ఎవరికి వారిగా గెలిచే అభ్యర్థులపై దృష్టిపెట్టాయి. ఏ మాత్రం తేడా అనిపించినా... పక్కనపెట్టేస్తూ కొత్త వారి కోసం అన్వేషించే పనిలో పడ్డాయి. ఇక ఈసారి ఎలాగైనా తెలంగాణను కొట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ మాత్రం....గతానికి భిన్నంగా అడుగులు వేసే ఆలోచనలో ఉంది. త్వరలోనే 50 శాతానికిపైగా అభ్యర్థులను ప్రకటించాలని చూస్తోంది. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్షన్ పై గురి పెట్టింది. పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో సక్సెస్ అయింది. జులై 2న ఖమ్మం గడ్డపై భారీ సభను తలపెట్టింది. ఇదే వేదిక నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూర్తించబోతుంది.
కొద్దిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్ జోష్ నెలకొంది. రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు ఏకతాటిపై వచ్చి పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించారు. ఎన్నికల వరకు ప్రస్తుతం ఉన్న స్పూర్తినే కొనసాగిస్తూ ముందుకు సాగాలని చూస్తున్నారు. ఇక భట్టి పాదయాత్ర కూడా పార్టీకి కలిసివచ్చిందనే చెప్పొచ్చు. ఆదిలాబాద్ నుంచి మొదలైన పాదయాత్ర... జులై 2న ఖమ్మంలో ముగియనుంది. ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు కూడా భట్టికి మద్దతుగా నిలిచారు. ఏకతాటిపైనే ఉన్నామనే సందేశాన్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేశారు. ఇక పాదయాత్రలో భాగంగా... భట్టి పలు హామీలు ఇస్తూ వచ్చారు. ఇక ఖమ్మం వేదికగా.... ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని భావిస్తున్న కాంగ్రెస్... ఓ మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
భారీగా ఏర్పాట్లు….
ఖమ్మం సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. రాహుల్ గాంధీ వస్తుండటంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. భట్టి పీపుల్స్ మార్చ్ యాత్ర ముగింపు.. పొంగులేటితో సహా పలువురు నేతలు పార్టీలో చేరిక కోసం కాంగ్రెస్ ఈ సభను నిర్వహిస్తోంది. ఇదే వేదికగా భట్టిని ప్రత్యేకంగా అభినందించనున్నారు రాహుల్ గాంధీ. పొంగులేటితో పాటు పలువురిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దాదాపు 2 లక్షల వరకు జన సమీకరణ చేసేలా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను తరలించనుంది. ఈ ఖమ్మం వేదికగా రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఖమ్మం సభ విజయవంతం చేయటం ద్వారా…. ఆపరేషన్ ఆకర్ష్ ను మరింత ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇతర పార్టీల నేతలను పార్టీలోకి తీసుకోవటంతో పాటు… త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటించటం ద్వారా బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి గట్టి సవాల్ విసిరాలని భావిస్తోంది.
సంబంధిత కథనం