TG Family Digital Cards : ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పత్రాలు విడుదల - ఈ ఒక్క కార్డుతోనే 30 రకాల ప్రభుత్వ సేవలు!-cm revanth reddy released the survey documents related to the design of family digital card ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Family Digital Cards : ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పత్రాలు విడుదల - ఈ ఒక్క కార్డుతోనే 30 రకాల ప్రభుత్వ సేవలు!

TG Family Digital Cards : ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పత్రాలు విడుదల - ఈ ఒక్క కార్డుతోనే 30 రకాల ప్రభుత్వ సేవలు!

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 03, 2024 03:11 PM IST

ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన సర్వే పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… ఒకసారి కార్డు పొందిన తర్వాత రేషన్ తో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను ఎక్కడి నుంచైనా పొందడానికి వీలుంటుందన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రాధాన్యతను వివరిస్తూ పలు అంశాలను చెప్పారు.

ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు సర్వే పత్రాలు విడుదల
ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు సర్వే పత్రాలు విడుదల

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వన్ స్టేట్ – వన్ కార్డు ఆలోచనతో చేపట్టిన ఈ బహుళ ప్రయోజన కార్డుల జారీ ప్రక్రియను ప్రజలంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన సర్వే పత్రాలను సికింద్రాబాద్‌లోని సిఖ్ విలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వివరించారు.

సలహాలు ఇవ్వండి - సీఎం రేవంత్ రెడ్డి

"రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, రైతుబీమా, రైతు భరోసా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు 30 శాఖలు 30 రకాలుగా సమాచారం సేకరించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అలా కాకుండా అర్హులైన వారందరూ ఒకే కార్డు ద్వారా ఈ సేవలు పొందడానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందజేస్తారు. ఇందుకోసం 3 నుంచి 5 వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. ప్రతిపక్షాలు దీనిపై ఎవైనా సూచనలు, సలహాలు ఉంటే ఇవ్వాలి" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

మార్పుచేర్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చు…

కుటుంబంలో సభ్యులు పెరిగినందున ప్రజలంతా కుటుంబ డిజిటల్ కార్డు కోసం వివరాలను నమోదు చేయించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో అవసరమైన మార్పుచేర్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చన్నారు. ఒక్క క్లిక్ తో కుటుంబ సమగ్ర సమాచారం ఉండాలన్న ఆలోచనతో ఈ విధానం తీసుకొచ్చామని చెప్పారు. ఒకసారి కార్డు పొందిన తర్వాత రేషన్ తో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను ఎక్కడి నుంచైనా పొందడానికి వీలుంటుందన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ వాళ్ల రాలేదని దుయ్యబట్టారు. ఆ రోజు కనీసం సూచనలు కూడా చేయలేదన్నారు. పేదల కోసం ఏదైనా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు.

Whats_app_banner