TG Govt Digital Health Card : 30 రోజుల్లో డిజిటల్‌ హెల్త్‌ కార్డులు - సీఎం రేవంత్ కీలక ప్రకటన-cm revanth reddy announced that digital health cards will be given in 30 days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Digital Health Card : 30 రోజుల్లో డిజిటల్‌ హెల్త్‌ కార్డులు - సీఎం రేవంత్ కీలక ప్రకటన

TG Govt Digital Health Card : 30 రోజుల్లో డిజిటల్‌ హెల్త్‌ కార్డులు - సీఎం రేవంత్ కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 26, 2024 08:13 PM IST

డిజిటల్ హెల్త్ కార్డులు జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన చేశారు. వచ్చే 30 రోజుల్లోనే ఫ్యామిలీ డిజిటల్‌ హెల్త్‌కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ వివరాలను సేకరిస్తారని పేర్కొన్నారు.

త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు
త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు

రాష్ట్రంలో పౌరులు అందరికీ హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేసి ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. డిజిటల్ హెల్త్ కార్డుల రూపకల్పనకు ఆరోగ్య రంగంలో పనిచేస్తోన్న స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉండాలని ఆకాక్షించారు.

గురువారం ప్రఖ్యాత దుర్గాబాాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ ప్రాంగణంలో రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదరతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇప్పుడున్నది సంక్షేమాభివృద్ధిని అమలు చేసే ప్రజా ప్రభుత్వమని చెప్పారు.

ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియెంటెడ్ ప్రభుత్వం కానేకాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు. హెల్త్ ప్రొఫైల్ కార్డుల ప్రక్రియలో సహకారానికి సంబంధించి సామాజిక బాధ్యత కలిగిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సభ లాంటి సంస్థలతో త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి దామోదరకు సూచించారు.

క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. క్యాన్సర్ చికిత్స పేదలకు భారమవుతోందని, రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సభ, హాస్పిటల్ సేవల విస్తరణపై యాజమాన్యం తీసుకొచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, అమలుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

"ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నాం. పూర్తి సమాచారాన్ని డిజటలైజేషన్ చేస్తాం. క్యూఆర్ కోడ్ తో రూపొందిస్తారు. వ్యక్తి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు. తద్వార భవిష్యత్తులో సదరు వ్యక్తికి అందించే వైద్య సేవల విషయంలో వైద్యులకు పూర్తి అవగాహన వస్తుంది. 30 రోజుల్లోనే ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులను ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ప్రతి గ్రామంలోనూ వివరాలను సేకరిస్తారు" అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

83 లక్షల కుటుంబాల వివరాల సేకరణ…

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డుల ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. 83 లక్షలకు పైగా కుటుంబాల ఆరోగ్య వివరాలను సేకరించనుంది. ఈ సమాచారాన్ని ప్రత్యేక యాప్ లో ఎంట్రీ చేయనున్నారు. త్వరలోనే డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ కార్డులను జారీ చేయాలని సర్కరార్ భావిస్తోంది. ఓ వ్యక్తికి సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారం తెలుసుకునేలా ఈ కార్డులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో సమాచార సేకరణ నుంచి కార్డుల జారీ వరకు అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని వైద్యారోగ్య శాఖ ఇప్పటికే నిర్ణయించింది.

రాష్ట్రంలోని 2011 జనాభా లెక్కల ప్రకారం 83.04 లక్షల కుటుంబాలలోని వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేస్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి గడపకు తిరిగి వారి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటల్ రూపంలో యాప్ లో నమోదు చేయాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది.

వ్యక్తుల సమాచారాన్ని వారి అనుమతితోనే రెండు దశల్లో సేకరించే అవకాశం ఉంది. డిజిటల్ హెల్త్ కార్డులో భాగంగా… ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. బార్‌ కోడ్‌ కూడా ఉంటుంది. . సర్వే వివరాల నమోదుతో పాటు డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి రాష్ట్ర ఐటీ శాఖ నుంచి సహకారం తీసుకోనున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులివ్వడానికి సుమారు రూ.180 కోట్లు అవసరమని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.