Digital payments: ‘ఓటీపీ ఒక్కటే సరిపోదు.. ఇవి కూడా అవసరమే’- డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఆర్బీఐ మరిన్ని జాగ్రత్తలు
Digital payments: ఆన్ లైన్ పేమెంట్స్ లో కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో.. డిజిటల్ పేమెంట్స్ ను మరింత సురక్షితం చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరిన్ని ప్రత్యామ్నాయ ధ్రువీకరణలను ప్రతిపాదిస్తోంది. ఇందుకోసం ముసాయిదా ఫ్రేమ్ వర్క్ ను ఆర్బీఐ విడుదల చేసింది.
Digital payments: వరుస ఆన్ లైన్ మోసాలు, సైబర్ స్కామ్స్ కారణంగా సామాన్యులు భారీగా నష్టపోతున్న నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులు సురక్షితంగా ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన చర్యలు తీసుకుంటోంది.
మల్టిపుల్ ఆథెంటికేషన్..
డిజిటల్ చెల్లింపుల భద్రతకు, ముఖ్యంగా ఆన్ లైన్ లో చెల్లింపులు చేయడానికి అదనపు ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ (AFA) అవసరమని ఆర్బీఐ కొన్నేళ్లుగా చెబుతోంది. ప్రస్తుతం ఉన్న ఓటీపీ విధానం విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ.. ఓటీపీతో పాటు అదనపు ఆథెంటికేషన్ అవసరమని ఆర్బీఐ (RBI) సూచిస్తోంది. ఈ ఫిబ్రవరిలో ‘‘డిజిటల్ పేమెంట్స్ కోసం ఆల్టర్నేటివ్ ఆథెంటికేషన్ మెథడ్స్’’ పై ఒక మార్గదర్శక పత్రాన్ని ఆర్బీఐ విడుదల చేసింది.
ఫ్రేమ్ వర్క్ ముఖ్య వివరాలు
పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ల ద్వారా చెల్లింపు సాధనాలను ధృవీకరించడానికి, అనుసరించాల్సిన పలు మార్గదర్శకాలను ఆర్బీఐ సూచించింది.
1. అన్ని డిజిటల్ చెల్లింపు లావాదేవీలకు అదనపు ఆథెంటికేషన్స్ ను ఉపయోగించాలి.
2. కార్డ్-ప్రెజెంట్ లావాదేవీలు మినహా అన్ని డిజిటల్ చెల్లింపు లావాదేవీలు, ఆథెంటికేషన్ మెథడ్స్ లో ఒకటి డైనమిక్ గా ఉండాలి. అంటే, చెల్లింపు లావాదేవీ ప్రారంభించిన తర్వాత ఇది జనరేట్ కావాలి. ఇది ఆ ఒక్క లావాదేవీకే పరిమితం కావాలి.
3. అథెంటికేషన్ మెథడ్స్ వేర్వేరు కేటగిరీలకు చెందినవై ఉండాలి.
4. అదనపు ఆథెంటికేషన్ కస్టమర్ రిస్క్ ప్రొఫైల్, లావాదేవీ విలువపై ఆధారపడి కస్టమర్ అనుమతితో నిర్ణయించవచ్చు.
5. అర్హత కలిగిన అన్ని డిజిటల్ పేమెంట్ లావాదేవీల కొరకు కస్టమర్ ని రియల్ టైమ్ లో అలర్ట్ చేసే సిస్టమ్ కూడా ఉండాలి.
6. అథెంటికేషన్ అనే కొత్త ఫ్యాక్టర్ ను ఉపయోగించకుండా రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కూడా కస్టమర్ కు కల్పిస్తారు.
ఆర్బీఐ ముసాయిదా ఫ్రేమ్ వర్క్ పై అభిప్రాయాలు లేదా ఫీడ్ బ్యాక్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఆఫీస్, పద్నాలుగో అంతస్తు, షాహిద్ భగత్ సింగ్ మార్గ్, ముంబై-400001, సెప్టెంబర్ 15, 2024 లోగా పంపించవచ్చు. ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్ ఛార్జ్ కు పంపవచ్చు.