Modi Biopic: మోదీ చాలా హ్యాండ్సమ్, డైనమిక్.. ఆయనపై సినిమా తీస్తా: బాలీవుడ్ ప్రొడ్యూసర్
Modi Biopic: మోదీ చాలా హ్యాండ్సమ్, డైనమిక్ అని, ఆయనపై సినిమా తీస్తానని బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా అనడం విశేషం. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, పరీలాంటి సినిమాలతో ఈమె పేరు సంపాదించింది.
Modi Biopic: బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటికే టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, పరీలాంటి సినిమాలు తీసిన ఆమె.. తన తర్వాతి సినిమా ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ అని చెప్పింది. అంతేకాదు ఇండియాలో ఆయన చాలా హ్యాండ్సమ్, డైనమిక్, పోటీతత్వం ఉన్న వ్యక్తి అని కూడా ప్రేరణ అనడం విశేషం.
నిజానికి నరేంద్ర మోదీపై ఇప్పటికే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన బయోపిక్ పీఎం నరేంద్ర మోదీ సినిమా వచ్చింది. అయితే ఇది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరోసారి మోదీ బయోపిక్ తీస్తానని ప్రొడ్యూసర్ ప్రేరణ చెప్పడం ఆసక్తి రేపుతోంది. ఇండియాలో మోదీ కంటే పెద్ద హీరో మరెవరూ లేరని కూడా ప్రేరణ అభిప్రాయపడింది.
మరి ప్రేరణ తీయబోతున్న ఈ బయోపిక్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో ఎవరు కనిపించనున్నారన్నది కూడా ఇంట్రెస్టింగా మారింది. అయితే దీనికి అమితాబ్ బచ్చన్ అయితే బాగుంటుందని తాను భావిస్తున్నట్లు ప్రేరణ చెప్పింది. మోదీ పాత్ర పోషించడానికి బిగ్ బీ కంటే బెటర్ యాక్టర్ మరొకరు లేరని ఆమె స్పష్టం చేసింది. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలో జరిగిన మార్పులు కూడా ఈ సినిమాలో ఉంటాయని ప్రేరణ వెల్లడించింది.
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్.. ప్రభాస్, కమల్ హాసన్ తో కలిసి కల్కి 2898 ఏడీ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ శాన్ డీగో కామిక్ కాన్ లో రివీల్ చేశారు. అంతేకాదు మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ తో గూస్ బంప్స్ తెప్పించారు. ఈ సినిమాలో అమితాబ్ పాత్రపై ఆసక్తి నెలకొంది.