ఏపీలోని మందుబాబులకు అలర్ట్. ఇకపై వైన్ షాపుకెళితే చేతిలో డబ్బు ఉంటే సరిపోతుంది అనుకుంటే మీరు పొరబడినట్టే. డిజిటల్ చెల్లింపులు(Digital Payments) విధానాన్ని తీసుకురానున్నారు. రాష్ట్రంలోని రిటైల్ మద్యం దుకాణా(Liquor Shops)లలో డిజిటల్ చెల్లింపులను త్వరలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం తీసుకువస్తుంది. ఈ సదుపాయం AP స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా నిర్వహించనున్నారు. మద్యం దుకాణాలలో హార్డ్ క్యాష్‌ను తీసుకునేప్పుడు జరుగుతున్న తప్పిదాల నుంచి బయటపడేందుకు ఈ విధానాన్ని తీసుకురానున్నారు.
డిజిటల్ చెల్లింపు(Digital Payments) సౌకర్యం ముందుగా 1,000 రిటైల్ మద్యం దుకాణాలలో అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన వాటికి విస్తరించే అవకాశం ఉంది. డిజిటల్ చెల్లింపులను అంగీకరించే బాధ్యతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి అప్పగించారు. కస్టమర్‌లు డిజిటల్‌గా చెల్లించిన మొత్తాన్ని APSBCLకి చెల్లించడానికి SBI విధివిధానాలను రూపొందిస్తోంది. కార్పొరేషన్, ఈ మొత్తాన్ని మద్యం తయారీదారులు/ సరఫరాదారులకు ఎప్పటికప్పుడు మద్యం నిల్వలను పొందడానికి చెల్లిస్తుంది.
ఇప్పటివరకు, APSBCL మద్యం కొనుగోలుదారుల నుండి హార్డ్ క్యాష్‌ను సేకరించి, దానిని SBIలో డిపాజిట్ చేస్తోంది. ఈ డబ్బును మరుసటి పని దినం ప్రభుత్వ ఖజానాకు పంపుతుంది. నిర్ణీత సమయంలో మొత్తం APSBCLకి పంపిస్తారు. ఇది మద్యం సరఫరాదారులు / తయారీదారులకు చెల్లింపు చేస్తుంది.
మద్యం వ్యాపారం(Liquor Business) ద్వారా రోజుకు కోట్లలో వస్తుంది. ఈ మొత్తంలో దాదాపు 1 నుంచి 2 శాతంతో డిజిటల్ చెల్లింపులు ఉంటాయి. రోజువారీ వేతన కార్మికులు, ఆర్థికంగా బలహీన వర్గాల వంటి వినియోగదారులు ఎక్కువే ఉంటారు. వాళ్లు డిజిటల్ చెల్లింపును ఎంచుకోకపోవచ్చు. UPI QR కోడ్‌ని స్కాన్ చేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడిన స్మార్ట్ ఫోన్ కూడా వారికి ఉండకపోవచ్చు.
బ్రాండ్, వాల్యూమ్, ధర, మద్యం అవుట్‌లెట్, కస్టమర్ గుర్తింపు, ఇతర వివరాల పరంగా మద్యం విక్రయాలను ట్రాక్ చేసేందుకు డిజిటల్ చెల్లింపులు సహాయపడతాయని APSBCL అధికారులు చెబుతున్నారు. మెుదట 1000 మద్యం దుకాణాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తారు. ఆ తర్వాత మిగిలిన వాటిలో ప్రారంభిస్తారు. అయితే నవంబర్ 21 నుంచి ఈ విధానం అమలులోకి తీసుకొస్తారనే చర్చ కూడా ఉంది. కార్డు స్వైపింగ్, యూపీఐ(UPI), క్యూఆర్ కోడ్ తదితర డిజిటల్ చెల్లింపుల ద్వారా చేయోచ్చు. డైరెక్ట్ నగదు లావాదేవీలు అయితే స్థానికంగా షాపుల్లో ఉండే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.