CM KCR meeting with farmers: 26 రాష్ట్రాల రైతులతో సీఎం కేసీఆర్ భేటీ-cm kcr meeting with farmer leaders at pragati bhavan ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Meeting With Farmer Leaders At Pragati Bhavan

CM KCR meeting with farmers: 26 రాష్ట్రాల రైతులతో సీఎం కేసీఆర్ భేటీ

Mahendra Maheshwaram HT Telugu
Aug 27, 2022 03:56 PM IST

kcr meeting with farmers: ప్రగతి భవన్ వేదికగా రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...రాష్ట్ర ప్రగతిని దృశ్యమాధ్యమం ద్వారా వివరించారు.

రైతులతో సమావేశంలో సీఎం కేసీఆర్
రైతులతో సమావేశంలో సీఎం కేసీఆర్ (twitter)

cm kcr meeting with farmer leaders: తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రెండోరోజు కొనసాగింది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి... తెలంగాణ రాష్ట్ర ప్రగతి తీరును వివరించారు.

farmers leaders with kcr: వ్యవసాయం, సాగునీటి రంగం తదితర తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని రైతులు తిలకించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు, డాక్యుమెంటరీలోని దృశ్యాలు, వివరణలు అద్దంపడుతున్నాయని రైతు సంఘాల నాయకులు తెలిపారు. తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు ఉంటే తాము కూడా ఎంతో అభివృద్ధి చెందేవారమని వారు అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు, మా రాష్ట్రాల్లోని రైతుల గురించి కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని వారు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘‘మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడకుండా, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను మనం అన్వేషించాలి. స్వాతంత్ర్య పోరాటం ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు సిద్ధపడుతుండటం ఎందుకో మనందరం ఆలోచించాల్సి ఉంది. ముఖ్యంగా దేశంలోని రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడంలేదో, ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో మనందరం చర్చించుకోవాల్సిన సందర్భం ఇది.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

‘famers meeting at pragati bhavan: ‘చట్టసభల్లో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తుండటం, ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేయడం అనే పొంతనలేని ప్రక్రియ ఒకటి ఈ దేశంలో కొనసాగుతుండటం మనందరి దురదృష్ణకరం.’’ అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు, ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్షించాల్సి ఉంటదని సీఎం అన్నారు. ఈ సంఘర్షణ ప్రారంభదశలో మనతో కలిసివచ్చే శక్తులు కొంత అనుమానాలు, అయితదా కాదా? అనే అపోహలకు గురవుతుంటారని సీఎం వివరించారు. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందన్నారు.

అడుగులు వేయాలి - సీఎం కేసీఆర్

‘‘భారతదేశంలో ప్రకృతి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి దేవుడిచ్చిన వరం. అమెరికా, చైనా వంటి మిగతా ఏ దేశాలతో పోల్చి చూసినా నీటి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి, మానవ వనరులు భారతదేశంలోనే పుష్కలంగా ఉన్నాయి. దేశంలో మొత్తం 40 వేల కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉన్నది. ఈ భూముల సాగుకు కావల్సింది కేవలం 40 వేల టీఎంసీల నీళ్లు మాత్రమే. తాగునీటికి 10 వేల టీఎంసీలైతే సరిపోతాయి. మరి, 70 వేల టీఎంసీల నీటి వనరులు మన దేశంలో అందుబాటులో ఉన్నా కూడా, ఎందుకు సాగునీటికి, తాగునీటికి దేశ ప్రజలు ఇంకా కూడా ఎదురు చూడాల్సి వస్తున్నది. అదే సందర్భంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం మన దేశానికి ఉన్నది. అయినా, 2 లక్షల మెగావాట్ల విద్యుత్ ను కూడా వినియోగించుకోలేకపోతున్నాం. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ, సాగునీటిని అందిస్తున్నపుడు ఇదేపనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదు? రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్లు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్ లు ఉన్నాయా? సాగునీరున్నది. కరెంటు ఉన్నది. కష్టపడే రైతులున్నారు. అయినా ఈ దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకున్నది. రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? కేంద్ర పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయాలను మనం విశ్లేషించుకొని, చర్చించాల్సిన సందర్భం ఇది. మన దేశ వనరులను సరిగా వినియోగించుకుంటూ దేశ సౌభాగ్యాన్ని గుణాత్మకంగా అభివృద్ధి పరిచే రైతు వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం మనం అడుగులు వేయాల్సి ఉన్నది.’’ అని సీఎం కేసీఆర్ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ సహా ఢిల్లీ, ఒడిషా, గుజరాత్,కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పాండిచ్చేరి, దాదానగర్ హవేలి తదితర రాష్ట్రాలకు చెందిన, వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న పలువురు సీనియర్ రైతు సంఘాల నేతలు సహా దాదాపు 100 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.

IPL_Entry_Point