KCR: శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు-cm kcr high level review on law and order in sate ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr: శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

KCR: శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

Mahendra Maheshwaram HT Telugu
Aug 25, 2022 07:33 AM IST

cm kcr key orders on law and order: రాష్ట్రంలో శాంతిభద్రతలు, ప్రత్యేకంగా హైదరాబాద్ లోని నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

<p>సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)</p>
సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో) (twitter)

High Tension Situation At Old City hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో ఎపిసోడ్ తో హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వర్గంపై రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో నిరసనలు చేపడుతున్నారు. దీంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, హైదరాబాద్ లో శాంతి భద్రతలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సీఎం కీలక ఆదేశాలు...

cm kcr on law and order: ఈ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని చెప్పినట్లు తెలిసింది. పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ముందుకువెళ్లాలని దిశానిర్దేశం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Police imposed restrictions in old city: ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో పాత బస్తీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్​ను అరెస్ట్ చేయాలంటూ ఓ వర్గం పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి ఆందోళనకు దిగింది. చార్మినార్‌, మదీన, చాంద్రయాణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుధవారం ఉదయం కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రం మరో 20 మందిని, తాజాగా షాలిబండ క్రాస్​రోడ్డులో ఆందోళన చేస్తున్న 50 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Bandi sanjay arrest: మరోవైపు బండి సంజయ్ అరెస్ట్​ నేపథ్యంలో బీజేపీ పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సమీక్షలో నగరంలోని మూడు కమిషనరేట్ల సీపీలు కూడా సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్సీ కవితపై లిక్కర్​ స్కామ్​ ఆరోపణలు రావడంతో గత మూడు రోజులుగా భాజపా కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. మరోవైపు పాతబస్తీలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా యాక్షన్ ఫోర్స్ బలగాలను దించారు.

హైదరాబాద్​లోని పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని పాతబస్తీలో ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గస్తీ వాహనంలో తిరుగుతూ దుకాణాలను పోలీసులు మూసివేయించారు. రాత్రి 8 గంటల తర్వాత మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

Whats_app_banner