Hyderabad : పాతబస్తీలో మరో 20 మంది అరెస్టు.. 8 గంటలకే అన్నీ బంద్
ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాత బస్తీలో నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ ఓ వర్గం పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
పాతబస్తీలో మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్, మదీన, చాంద్రయాణగుట్ట, బార్కాస్, సిటీ కాలేజ్ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంగళవారం రాత్రి నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఉదయం కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మరో 20 మందిని షాలిబండ దగ్గరలో అరెస్టు చేశారు.
పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలుప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులను మోహరించారు. ఎలాంటి ర్యాలీలు చేసిన పోలీసులు అనుమతించడం లేదు. ఉదయమే ర్యాలీ చేస్తున్న 31 మందిని అరెస్ట్ చేసి కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వార్తలను నమ్మెుద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం ర్యాలీగా వచ్చిన 20 మంది ఆందోళనకారులను అడ్డుకుని అరెస్టు చేశారు.
గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పాతబస్తీ సహా దక్షిణ మండలంలో మద్యం, పాన్ షాపులు, దుకాణాలు, హోటళ్లు రాత్రి 8గంటలకే మూసి వేయాలని పోలీసులు చెప్పారు. రాత్రి కూడా పోలీసు అదనపు బలగాలు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో మోహరిస్తున్నాయి. మీర్ చౌక్, చార్మినార్, గోషామహల్ జోన్ల పరిధుల్లో మొత్తం 360 మంది ఆర్‌ఏఎఫ్ బలగాలు విధుల్లో ఉంటున్నాయి.