CM KCR In Bihar : వెనకబడిన రాష్ట్రాలకు సాయం చేయకుంటే అబివృద్ధి ఉండదు
CM KCR Bihar Tour : గాల్వాన్ వీరుల త్యాగం మరువలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. వెనకబడిన రాష్ట్రాలకు సాయం చేయకపోతే దేశం అభివృద్ధి చెందదని చెప్పారు. బిహార్ లాంటి రాష్ట్రానికి సాయం చేయాల్సిందేనని పేర్కొన్నారు.
అమర వీరుల కుటుంబాలతో పాటు సికింద్రాబాద్ ప్రమాద బాధితుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. బిహార్ పర్యటనలో భాగంగా పట్నా చేరుకున్న ఆయనకు బిహార్ సీఎం నీతీశ్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున అమరుల కుటుంబాలకు నీతీశ్‌తో కలిసి కేసీఆర్ చెక్కులు అందించారు. సీఎం కేసీఆర్‌కు బిహార్ సీఎం నితీశ్, డిప్యూటి సీఎం తేజస్వి యాదవ్ అభినందనలు తెలిపారు.
గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు కేసీఆర్. అమరులైన ఒక్కో సైనిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించారు. సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్నిప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. మరణించిన ఒక్కో వలస కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు.
'వెనకబడిన రాష్ట్రాలకు సాయం చేయకపోతే దేశం అభివృద్ధి చెందదు. బిహార్ లాంటి రాష్ట్రానికి సాయం చేయాల్సిందే. దేశం సురక్షితంగా ఉందంటే అందుకు సైనికులే కారణం. అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం. దేశం కోసం అమర జవాన్లు ప్రాణాలు అర్పించారు. వారి త్యాగం వెలకట్టలేనిది. ప్రతి భారతీయుడు సైనికులకు అండగా ఉంటాడు. బిహార్‌లో చేపట్టే మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను.' అని సీఎం కేసీఆర్ అన్నారు.
దేశం కోసం అమర జవాన్లు త్యాగాలు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. అమర జవాన్ల త్యాగం వెలకట్టలేనిదని చెప్పారు. ప్రతి భారతీయుడు సైనికులకు అండగా ఉంటాడని పేర్కొన్నారు. కరోనా సమయంలో వలస కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారన్న కేసీఆర్.. వలస కార్మికుల కోసం రైళ్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో వలస కార్మికులు భాగస్వాములు అని అన్నారు. వాళ్ల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని హామీ ఇచ్చారు.
అంతకుముందు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు కేసీఆర్. బిహార్ సీఎం నితీశ్ కార్యాలయానికి వెళ్లారు. నితీశ్‌తో పాటు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం నితీశ్‌తో కలిసి ఆర్థికసాయం పంపిణీ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత నితీశ్ ఆహ్వానం మేరకు లంచ్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, కేంద్రం ప్రభుత్వం వైఖరిపై ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకునే అవకాశం ఉంది.