BJP President Fires On CM: అవన్నీ కేసీఆర్ సర్కార్ హత్యలే
bjp chief band sanjay fires on cm kcr: జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఇబ్రహీంపట్నం బాధితులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ibrahimpatnam family planning incident: ఇబ్రహీంపట్నం ఘటన బాధితులను ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కు.ని ఆపరేషన్ వికటించి నలుగురు మహిళల మృతి చెందడానికి కేసీఆర్ సర్కార్ మూర్ఖత్వమే కారణమని ఆరోపించారు. బుధవారం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై మండిపడ్డారు.
family planning incident: ఈనెల 25న ఇబ్రహీంపట్నంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మొత్తం 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయని.. దురద్రుష్టవశాత్తు 4 గురు చనిపోయారని బండి సంజయ్ అన్నారు. మరో 30 మంది ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం బాధాకరమని చెప్పారు. ఈ ఆపరేషన్ (ల్యాప్రోస్కోపిక్) అనేది చాలా చిన్నది.. 5 నిమిషాల్లోపు జరిగే ఆపరేషన్ కు 4 గురు చనిపోవడంతోపాటు మిగిలిన వారందరికీ ఇన్ఫెక్షనై ఆసుపత్రిలో చికిత్స పొందడమనేది పెద్ద ఘటన అని తెలిపారు.
band sanjay fires on cm kcr: 'కేసీఆర్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ సర్కార్ చేసిన హత్యలే. ఆసుపత్రికి వెళితే చికిత్స పొందుతున్న బాలింతలు ఏడుస్తున్నారు. వాళ్లందరికీ చిన్న చిన్న పిల్లలున్నారు. వాళ్ల భవిష్యత్తేంది?ఆపరేషన్ చేసేటప్పుడు కనీసం మత్తు ఇంజక్షన్ ఇయ్యలేదు. సర్జరీ చేస్తుంటే ఏడ్చినం.. ఆపరేషన్ అయినంక ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ కనీసం బాధితులను పరామర్శించడానికి రాలేదు. ఏం ఉద్దరించడానికి బిహార్ పోతున్నాడు. ఇక్కడి పైసలు తీసుకుపోయి బీహార్ ల పెడతరా? 24 గంటలు ఎవరి కొంపలు ముంచాలనే రాజకీయాలు చేయడమే తప్ప పేదల గురించి ఆలోచనే లేని వ్యక్తి కేసీఆర్. హరీష్ రావు అబద్దాల మంత్రి. ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే. మంత్రులు, టీఆర్ఎస్ నేతల పనంతా నిత్యం లిక్కర్, ల్యాండ్, డ్రగ్స్, శ్యాండ్ దందాలే. ఇంత పెద్ద ఘటన జరిగితే... ఏదో ఒక కమిటీ వేసి తూతూ మంత్రపు చర్యలు తీసుకుంటున్నారే తప్ప చేసిందేముంది?' అని ప్రశ్నించారు.
కోటి రూపాయలు ఇవ్వాలి
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై చనిపోయిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీంతోపాటు ఆ కుటుంబాలకు ఇండ్లు ఇవ్వాలని... పిల్లలకు విద్యకయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలివ్వాలని పేర్కొన్నారు. రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. పేదల ప్రాణాల కంటే కేసీఆర్ సర్కార్ కు పేరు ప్రఖ్యాతలే ముఖ్యమని అన్నారు. సీఎం కేసీఆర్ కు పేదల ఉసురు కచ్చితంగా కొడుతోందని దుయ్యబట్టారు.
'చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఒప్పుకోం. ఎనిమిదేళ్ళ కాలంలో ఒక్క పేద కుటుంబాన్ని కూడా సీఎం కేసీఆర్ పరామర్శించలేదు. సీఎం కేసీఆర్ మనిషి కాదు.. రాక్షసుడు. బెదిరించి ఆపరేషన్లు చేశారని చికిత్స పొందుతోన్న మహిళలు చెబుతున్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన వైద్యశాఖ మంత్రిని తక్షణమే బర్త్ రఫ్ చేయాలి. హరీష్ రావు కుటుంబ సభ్యుడు కాబట్టే ఆయనపై సీఎం చర్యలు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా బాధితులను పరామర్శించేందుకు ఎందుకు రాలేదో సీఎం సమాదానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆగస్టు 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. సామూహిక స్టెరిలైజేషన్ శిబిరంలో భాగంగా నిర్వహించిన శస్త్ర చికిత్సలు కొంతమందికి వికటించాయి. వివిధ సమస్యలతో నలుగురు మహిళలు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.