Sangareddy School: ఆ ఊర్లో బడికి వెళ్లాలంటే పిల్లలకు భయంభయం,ప్రమాదకరంగా స్కూలు భవనం…
Sangareddy School: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పురాతన భవనం కావడంతో పై కప్పు (స్లాబ్) బీటలు వారి వర్షపు నీరు క్లాస్ రూంలో నుండి బయటకు వస్తున్నాయి.
Sangareddy School: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పురాతన భవనం కావడంతో పై కప్పు (స్లాబ్) బీటలు వారి వర్షపు నీరు క్లాస్ రూంలో నుండి బయటకు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు తరగతి గదులు ఎక్కడ కూలిపోతాయోనని భయంభయంగా, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పాఠశాలకు వస్తున్నారు.
అంతే కాకుండా విద్యార్థులు తరగతి గదుల తడి గోడలను తాకినప్పుడు విద్యుత్ షాక్ కు గురవుతున్నారు. ఈ కారణంగా ఉపాద్యాయులు పాఠశాల భవనం బయట చెట్ల కింద పిల్లలను కూర్చోబెట్టి పాఠాలు చెప్పే పరిస్థితి ఏర్పడింది. గత సోమవారం వర్షం వలన రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఇవ్వటంతో, మంగళవారం స్కూల్ కు తిరిగి వచ్చిన విద్యార్థులకు క్లాస్ రూమ్ లన్ని నీటి తో నిండి దర్శనమిచ్చాయి. ఇదే విషయాన్ని, హెడ్ మాస్టర్ విట్టల్ డీఈఓ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్ళటంతో, ఆ స్కూల్ కి మరొక రోజు సెలవు ప్రకటించారు.
100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాల.…
ముదిమాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 145 మంది విద్యార్థులు ఉండగా 11 మంది ఉపాద్యాయులతో సహా 13 మంది సిబ్బంది ఉన్నారు. కాగా 2024 లో పదవతరగతి బోర్డు పరీక్షలలో ఈ పాఠశాల 100 శాతం ఫలితాలను సాధించింది. అయినా పాఠశాల గదులన్నీ శిథిలావస్థకు చేరడంతో పాఠశాలలో చేరడానికి ఎక్కువ మంది విద్యార్థులు ముందుకు రావడం లేదు. ఈ పాఠశాల భవనం నిర్మించి 70 సంవత్సరాలు గడిచిపోవడంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు గ్రామస్థులు వాపోతున్నారు.
1952 లో నిర్మించిన పాఠశాల....
మొదట ఈ పాఠశాల భవనాన్ని 1952 లో నిర్మించారు. మిగతా ఐదు క్లాస్ రూమ్స్ ని కూడా 40 సంవత్సరాల క్రితమే నిర్మించారు. నూతన భవనం నిర్మించే వరకు పాఠశాలను ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేయాలనీ ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పాఠశాల భవనం ఎప్పుడైనా కూలిపోయి తమ పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని తల్లితండ్రులు భయాందోళన చెందుతున్నారు.
వర్షాలు పడ్డ ప్రతిసారి విద్యార్థులతో పాటు ఉపాద్యాయులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురాతన భవనం కావడంతో స్లాబ్ పెచ్చులూడి క్లాస్ రూంలో పడుతున్నాయి. అందుకే విద్యార్థులను ఆరుబయట కూర్చేబెట్టి పాఠాలు బోధిస్తున్నామని ఉపాద్యాయులు చెబుతున్నారు.
మంత్రి దృష్టికి తీసుకెళ్లినా…
పుల్కల్ మండలం, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కు చెందినది కావటంతో, హెడ్ మాస్టర్ విట్టల్ సింగూరు నుండి నీటిని విడుదల చేయటానికి వచ్చిన మంత్రిని కలిసి స్కూల్ పరిస్థితి ని తెలుపుతూ ఒక వినతి పత్రం ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి ప్రకటన రాలేదు, ప్రతి రోజు జిల్లాలో వర్షాలు రావటంతో, పిల్లను ఆరు బయట కూర్చొని చదువు చెప్పక పరిస్థితి ఇక్కడ ఉపాధ్యాయులది.