CM Revanth In Delhi: ఢిల్లీలో బిజీబిజీగా సిఎం రేవంత్ రెడ్డి
CM Revanth In Delhi: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సిఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు.
CM Revanth In Delhi:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లో పర్యటిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు, నిధులకు సంబంధించిన అంశాలపై అయా శాఖల మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో మొదట కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం.. రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హోంమంత్రిని రేవంత్ రెడ్డి కలిశారు. విభజన చట్టంలోని హామీల అమలు పై ప్రదానంగా కేంద్ర హోం మంత్రి దృష్టికి తెచ్చారు.
అంతకుముందు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. సీఎంతో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి కలిశారు.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టణాభివృద్ధి శాఖ తరపున రావాల్సిన ప్రాజెక్టులను త్వరితగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
మరో రూపంలో సాయం చేస్తామన్నారు…
ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిని కలిసినప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరారని, తద్వారా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దానికి కొనసాగింపుగా ఇవాళ కేంద్ర జల శక్తి శాఖ మంత్రిని కలిసినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ఈ ప్రాజెక్టుతో 12 లక్షల ఎకరాలకి సాగునీరు అందించవచ్చని, ఆరు జిల్లాల్లో 1200 గ్రామాలకు మంచినీటి సౌకర్యం దొరుకుతుందని వివరించినట్టు చెప్పారు. ప్రాజెక్టు గురించి సుదీర్ఘంగా కేంద్ర మంత్రి తో చర్చించామని, కేంద్ర జల సంఘం నుంచి వెంటనే అనుమతి ఇవ్వాలని కోరామన్నారు.
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 60 శాతం కేంద్రం భరించాల్సిందిగా కోరామని ఉత్తమ్ వివరించారు. జాతీయ ప్రాజెక్టు విధానంలో తమ ప్రభుత్వం ముందుకు పోవడం లేదని కేంద్ర మంత్రి చెప్పారని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి వేరే స్కీం కింద నిధులు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతుతో పాటు ఫండింగ్ ఉంటుందని భరోసా ఇచ్చారని ఉత్తమ్ వివరించారు.