TS Assembly Election 2023: ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ... ఈ సీటును కూడా బీఆర్ఎస్ తేల్చేసిందా..? -brs working president ktr indirectly gave hint over bhupalpally assembly ticket 2023 elections ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Brs Working President Ktr Indirectly Gave Hint Over Bhupalpally Assembly Ticket 2023 Elections

TS Assembly Election 2023: ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ... ఈ సీటును కూడా బీఆర్ఎస్ తేల్చేసిందా..?

భూపాలపల్లి సభలో కేటీఆర్
భూపాలపల్లి సభలో కేటీఆర్

Telangana Assembly Election 2023: ఎన్నికల ఏడాది కావటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక అధికార పార్టీ(బీఆర్ఎస్)లో స్వరాలు మారుతున్నాయి. మరోవైపు టికెట్ల కాక మొదలైంది. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఇప్పటికే హుజురాబాద్ టికెట్ పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉండగా... ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మరో సీటు విషయంలో కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదీ కాస్త నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

BRS Bhupalpally Politics: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనుంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ... వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. ప్రత్యర్థి పార్టీలను డిఫెన్స్ లో పడేసేలా సూటిగా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. మరోవైపు గెలుపు గుర్రాలపై కూడా కసరత్తు చేసే పనిలో పడ్డాయి. మిగతా పార్టీలతో పోల్చితే... అధికార బీఆర్ఎస్ లో మాత్రం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఇద్దరి నుంచి ముగ్గురు నేతలు ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని సీట్లపై నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు కూడా నజర్ వేసిపెట్టారు. ఫలితంగా పలు స్థానాల్లో గ్రూప్ వార్ తెగ సెగలు పుట్టిస్తోంది. ఈ కేటగిరిలోకే వస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ సీటు. తాజాగా మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆయన చేసిన కొన్ని కామెంట్స్... చర్చనీయాంశంగా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ...!

భూపాలపల్లి.... ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తిరేపుతున్న ఓ సీటు. నిజానికి 2014 ఎన్నికల్లో సిరికొండ మధుసూదనచారి ఇక్కడ్నుంచి గెలిచారు. అంతేకాదు స్పీకర్ గా కూడా అవకాశం దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే 2018 ఎన్నికల్లో సిరికొండ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఇక్కడ్నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు. కొన్నిరోజుల పాటు కాంగ్రెస్ లోనే కొనసాగిన గండ్ర.... కారు ఎక్కారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. అప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి సిరికొండనే కేరాఫ్ గా ఉండగా... సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీలోకి రావటంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అంతా ఆయనే అన్నట్లు నడిపిస్తున్నారు. మొన్నటి వరకు ఎలాంటి పదవి లేకుండా ఉన్న... సిరికొండకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న సిరికొండ...తన ప్రాబల్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో సీటు దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో....రెండు రోజుల కింద భూపాలపల్లి పర్యటనకు వెళ్లారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్.... కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ పర్యటనలో సిరికొండకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కేటీఆర్ ని స్వాగతించటానికి వచ్చిన సిరికొండ మధుసూదనా చారిని, ఆయన అనుచరులను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక సభలో కేటీఆర్ మాట్లాడుతుండగా... గండ్ర, సిరికొండ వర్గాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరువర్గాలను సముదాయించినప్పటికీ... వెనక్కి తగ్గలేదు. ఓ దశలో మంత్రి కేటీఆర్... వారిని ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో సిరికొండను మీరే ఓడగట్టారని... కానీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకున్నారని చెప్పుకొచ్చారు. సిరికొండకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఉంటుందని.... ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారని అన్నారు. ఇంకా ఐదేళ్లపాటు ఎమ్మెల్సీగానే ఉంటారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గండ్ర, ఎమ్మెల్సీగా సిరికొండ ఉంటారని... నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందంటూ మాట్లాడారు. ఈ కామెంట్స్ కాస్త... సిరికొండ వర్గాన్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్లు అయింది. వచ్చే ఎన్నికల్లో కూడా గండ్రనే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని కేటీఆర్... పరోక్షంగా చెప్పకనే చెప్పేశారని పలువురు చర్చించుకుంటున్నారు.

మొత్తంగా చూస్తే... భూపాలపల్లి టికెట్ విషయంలోనూ బీఆర్ఎస్ హైకమాండ్ ఓ క్లారిటీతోనే ఉన్నట్లు చర్చలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గండ్ర, సిరికొండ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఆధిపత్యపోరు జరుగుతున్న వేళ... మంత్రి కేటీఆర్ కామెంట్స్ మరింత వేడిని పెంచాయనే చెప్పొచ్చు. ఎన్నికల నాటికి వీరి మధ్య గ్రూప్ వార్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. ఈ మధ్యే హుజురాబాద్ లో పర్యటించిన కేటీఆర్... ఈ తరహా కామెంట్సే చేశారు. అక్కడ గెల్లు వర్సెస్ కౌశిక్ రెడ్డి అన్నట్లు సాగుతున్న ఆధిపత్యపోరుకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల వరకు గ్రౌండ్ లోనే తిరగాలంటూ కౌశిక్ రెడ్డికి సభ వేదికగానే దిశానిర్దేశం చేశారు కేటీఆర్. దీంతో ఆ సీటు నుంచి కౌశిక్ రెడ్డే బరిలో ఉంటారని తెలుస్తోంది.

సంబంధిత కథనం