Notices to MLC Kaushik Reddy : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు.. ఎందుకంటే ?-national commission for women issues notices to mlc kaushik reddy over statements on governor ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Notices To Mlc Kaushik Reddy : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు.. ఎందుకంటే ?

Notices to MLC Kaushik Reddy : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు.. ఎందుకంటే ?

HT Telugu Desk HT Telugu
Feb 19, 2023 10:00 PM IST

Notices to MLC Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన జాతీయ మహిళా కమిషన్.. ఫిబ్రవరి 21న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గవర్నర్ తమిళిసై పై... కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్.. ఈ మేరకు నోటీసులు పంపింది.

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (facebook)

Notices to MLC Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళి సై పై పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు పంపింది. గవర్నర్ పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్... కౌశిక్ రెడ్డి నుంచి వివరణ కోరింది. గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయంది. ఫిబ్రవరి 21న ఉదయం 11.30 గంటలకు కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని అధికార పార్టీ ఎమ్మెల్సీని ఆదేశించింది. జాతీయ మహిళా కమిషన్ ఫిబ్రవరి 14న కౌశిక్ రెడ్డికి ఈ నోటీసులు పంపగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

గతనెలలో జమ్మికుంటలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న కౌశిక్ రెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శాసనసభ పాస్ చేసిన బిల్లులని గవర్నర్ ఆమోదించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బిల్లులు ఆమోదించకుండా దాచి పెడుతున్నారన్నారు. గవర్నర్ తీరు సరిగ్గా లేదని అన్నారు. తమిళి సై ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ సీరియస్ అయ్యారు.

తమిళి సై పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్ర గవర్నర్‌ను అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని, ఒక మహిళా గవర్నర్‌పై ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. అహంకారంతో ఒక గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిపై పలు పోలీస్ స్టేషన్లలో బీజేపీ నేతలు ఫిర్యాదులు చేశారు. బీజేపీ నేతల ఫిర్యాదులు, ఆరోపణలు, మహిళా సంఘాల డిమాండ్లతో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. గవర్నర్ తమిళిసైపై చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కమిషన్ నోటీసులిచ్చింది. నేరుగా విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం.. గవర్నర్ తమిళి సై మధ్య విభేదాలు... కౌశిక్ రెడ్డి అంశంలోనే మొదలైన విషయం తెలిసిందే. 2021 ఆగస్టులో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి.. గవర్నర్ తమిళిసై అడ్డుచెప్పారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ సర్కార్, గవర్నర్ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు ప్రభుత్వం నో చెప్పింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఇటీవల బడ్జెట్ సమావేశాల వేళ... వివాదం హైకోర్టుకి చేరింది. హైకోర్టు సూచనల మేరకు ప్రతిష్ఠంభన వీడడంతో... ఫిబ్రవరి 3న గవర్నర్ ప్రసంగం చేశారు. ఫిబ్రవరి 12న ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా, చర్చ అనంతరం ఆమోదం పొందింది. ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లును గవర్నర్‌కు పంపగా ఆమోదముద్ర వేశారు.

Whats_app_banner