BRS MLA'S: పార్టీ మారే ఆలోచన లేదంటున్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
BRS MLA'S: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో నలుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో వారు వివరణ ఇచ్చారు.
BRS MLA'S: బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ కథనాలు వెలువడటాన్ని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. బుధవారం నలుగురు ఎమ్మెల్యేలు ముఖ‌్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడంతపై పెద్ద ఎత్తున కథనాలు వెలువడటంతో తాము పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చారు.
రాజకీయ దురుద్దేశాలతో దుష్ప్రచారం చేస్తున్నారని, నలుగురు ఎమ్మెల్యేలు కలిసి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కల్పించారని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
పార్టీకి మా మీద నమ్మకం ఉందని సునీత లక్ష్మారెడ్డి చెప్పారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతున్న నేపథ్యంలో మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఎవరికి వివరణ ఇవ్వడానికి తాము రాలేదని, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, దురుద్దేశాలతో లేనిపోని మాటలతో అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆరోపించారు.
తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తనకు ఎదురవుతున్నా ఇబ్బందులతో పాటు అభివృద్ధి విషయంలో తమకు సహకరించాలని మాత్రమే సిఎంను కోరినట్టు చెప్పారు. పార్టీ మారే ఆలోచన తమకు లేదని ఆమె స్పష్టం చేశారు.
నిబద్ధతతో, క్రమశిక్షణతో బిఆర్‌ఎస్ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రిని కలవడం తప్పన్నట్లు వ్యవహరిస్తున్నారని, సిఎంను కలిసి నియోజక వర్గ సమావేశాల మీద మాట్లాడటం తమ హక్కని చెప్పారు. సిఎం కూడా కేంద్రంలో మంత్రులు, ప్రధాన మంత్రిని కలుస్తున్నారని, ఇదో సాధారణ ప్రక్రియ మాత్రమేనని చెప్పారు.
తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటం తగదన్నారు. ప్రోటోకాల్ కు సంబంధించిన విషయాలపై ప్రభాకర్, మహీపాల్ రెడ్డి, చింతా ప్రభాకర్ సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీలో ఎమ్మెల్యేలను కాదని ఇంచార్జిలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించి తమను అడ్డుకుంటున్నారని అడిషనల్ డిజిక ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రిని కలిసినట్టు చెప్పారు.
సిఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. కరెంటు బిల్లులు చెల్లించాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని, జనవరి నుంచి బిల్లులు కట్టొద్దని కాంగ్రెస్ నాయకులు చెప్పారని, ఇప్పుడు బిల్లులు కట్టాలని ఒత్తిడి చేస్తుండటంపై తాము ఖచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు. తమపై నిందలు వేయడం తగదన్నారు.
సిఎంతో భేటీ కావడాన్ని దుబ్బాక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమర్ధించుకున్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకా, తెలంగాణ రాష్ట్రానికా అనేది గ్రహించాలని చింతా ప్రభాకర్ పశ్నించారు. దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచాక అక్కడ ఒక రెవిన్యూ డివిజన్ కావాలని కోరుతూ సిఎంని కలిశానని, నియోజక వర్గంలో రోడ్లు కావాలని మాత్రమే కోరడానికి వెళ్లామన్నారు. దానిసపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారన్నారు.
తాను గతంలోనే కోమటిరెడ్డిని ఆర్ అండ్ బి రోడ్ల కోసం, మల్లన్న సాగర్ నీటి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశానని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి 15రోజులైనా నీరు రాలేదన్నారు. దుబ్బాకలో మంత్రి కొండా సురేఖ పర్యటిస్తున్నా తనకు సమాచారం లేదని, గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ప్రోటోకాల్ కల్పిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై ఫిర్యాదు చేయడానికి వెళితే తాము కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కూడా తమ నియోజక వర్గ సమస్యల కోసమే కలిశానని చింతా ప్రభాకర్ చెప్పారు. సిఎం, మంత్రులు, అధికారుల్ని కలవడం తప్పెలా అవుతుందన్నారు.
15రోజుల తర్వాత కూడా మల్లన్న సాగర్ నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయాయన్నారు. మంత్రి పర్యటిస్తుంటే కనీసం ఎమ్మెల్యేను పిలవకపోతే అది వారి సంస్కారమని భావించాల్సి ఉంటుందన్నారు.
దుబ్బాకలో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఆయనకు ప్రోటోకాల్ కల్పించామన్నారు.మెదక్ పార్లమెంటులో రానున్న ఎన్నికల్లో నూటికి నూరు శాతం గులాబీ జెండాను ఎగురవేస్తామన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు, హామీలతో ప్రజలను ఎలా మోసం చేశారో తేలుస్తామన్నారు.
ఒకేసారి సిఎంతో నలుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భేటీ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) , గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు) ,మాణిక్ రావు (జహీరాబాద్) సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. దీంతో తాము పార్టీ మారడం లేదని వారు వివరణ ఇచ్చారు.