BRS MLA Harish Rao : రేవంత్ రెడ్డి గారు... మమ్మల్ని కాదు మీ గురువును తిట్టండి-brs mla harishrao condemned cm revanth reddy comments ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Brs Mla Harishrao Condemned Cm Revanth Reddy Comments

BRS MLA Harish Rao : రేవంత్ రెడ్డి గారు... మమ్మల్ని కాదు మీ గురువును తిట్టండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 07, 2024 03:31 PM IST

BRS MLA Harish Rao On CM Revanth: మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. చిల్లర మల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దని హితవు పలికారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ( BRS)

BRS MLA Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao). గురువారం సంగారెడ్డిలో మాట్లాడిన ఆయన… మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే అని అన్నారు. రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలని హితవు పలికారు.

ట్రెండింగ్ వార్తలు

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయి. పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలే.. గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదు. మేము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం.. అలాంటి కేసీఆర్‌ను తిట్టడం అవివేకం.. తీవ్రంగా ఖండిస్తున్నాం. పేగులు మెడలో వేసుకొని రాక్షసులు తిరుగుతారు.. ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా..? పడిగట్టు పదాలు, పరుష పదజాలంతో పరిపాలన సాగదు. ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు. మంచిపేరు తెచ్చుకోవాలంటే వల్గారిటీ కాదు, చిల్లర మల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దు. నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతారు.. నేను అలా మాట్లాడి విలువ తగ్గించుకోను. కుసంస్కారంగా మాట్లాడటం వల్ల విలువ దిగజారుతుంది. భవిష్యత్‌లో రాజకీయాలకు వచ్చే వారికి స్ఫూర్తిగా మనం ఉండాలనే విలువలతో నేనుంటాను. ఎంత ఎత్తు ఉన్నమన్నది కాదు, ప్రజల కోసం ఎంత గట్టిక పని చేసినం అన్నది ముఖ్యం” అని హరీశ్ రావు అన్నారు.

కేసీఆర్ కిట్లు తెస్తే, రేవంత్ రెడ్డి తిట్లతో పోటీ పడుతున్నాడని ఎద్దేవా చేశారు హరీశ్ రావు. “మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని బతుకులు బాగుపడ్డాయి.. ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఎన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి చూస్తే కేసీఆర్ ఏం చేశారో రేవంత్ రెడ్డికి అర్థం అవుతుంది. పదేళ్లు చంద్రబాబు దత్తత తీసుకొని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు.. పాలమూరు వలసలు వాపస్ చేసింది కేసీఆర్. తన తండ్రి చనిపోతే స్నానం చేసేందుకు నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని వెళ్లినా అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా.. పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసింది కాంగ్రెస్ కాదా..? పాలమూరు కరువుతో రాజకీయాలు చేసింది కాంగ్రెస్, టీడీపీ. కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి వైఎస్ నీళ్లు తీసుకువెళ్తే రేవంత్ రెడ్డి మాట్లాడాడా? కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదు. 1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ మేము పదేండ్లలోనే రూ. 2600 కోట్లు ఖర్చు చేసి 3 లక్షల 7 వేల ఎకరాలకు నీళ్లు అందించాం. నెట్టంపాడు 2300 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము రూ. 540 కోట్లు ఖర్చు పెట్టి లక్షా 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. బొంబాయి బస్సులు బంద్ అయ్యేలా చేసింది బీఆర్ఎస్ పార్టీ. స్తవాలు కప్పి పెట్టి కేసీఆర్ మీద దాడి చేసే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు” అని హరీశ్ రావు దుయ్యబట్టారు..

చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల్లో నీళ్ల వాటా తేల్చే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు. తాము పోరాటం చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేలా చేశామని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ప్రజలను దృష్టి మరల్చే యత్నం సరికాదన్న హరీశ్… ఓట్లు సీట్లే కాదు నిజాయతీగా పని చేయాలని హితవు పలికారు.

WhatsApp channel