TPCC President : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ - హైకమాండ్ ప్రకటన
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాల మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే పార్టీ అధ్యక్ష బాధ్యతలను చూశారు. చాలా నెలలుగా పీసీసీ పీఠాన్ని భర్తీ చేసేందుకు కసరత్తు జరిగింది. ఇందుకోసం అనేక సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా బీసీ సామాజికవర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.
మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్థానం:
మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్థానం NSUIతో మొదలైంది. 1990లో ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు చేపట్టారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
మహేష్ కుమార్ గౌడ్ 2013 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
మహేష్ కుమార్ గౌడ్ 26 జూన్ 2021వ తేదీ నుంచి TPCC వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ సీటును ఆశించినప్పటికీ దక్కలేదు. ఈ స్థానం నుంచి షబ్బీర్ అలీ పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావటంతో జనవరి, 2024లో ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ పదవి దక్కింది. జనవరి, 31 2024వ తేదీన శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి… ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
కొద్దిరోజులుగా కసరత్తు…
పీసీసీ అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై పార్టీ అధినాయకత్వం లోతుగా కసరత్తు చేసింది. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రుల అభిప్రాయాలను కూడా అధినాయకత్వం సేకరించింది. అయితే ఈసారి బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకే ఈ పదవిని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు వార్తలు కూడా వచ్చాయి.
పీసీసీ అధ్యక్ష పదవి కోసం బీసీ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ గట్టిగా ప్రయత్నించారు. మరోవైపు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పీసీసీ ఛైర్ పై ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి వారుగా ప్రయత్నాలు చేశారు. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఎస్సీ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్, సంపత్ కుమార్ పేర్లు కూడా ప్రతిపాదనకు కూడా వచ్చినట్లు తెలిసింది. అయితే ఈసారి బీసీ నేతకే పీసీసీ కట్టబెట్టేందుకు అధినాయకత్వం మొగ్గుచూపటంతో మహేశ్ కుమార్ గౌడ్ కు అవకాశం దక్కింది.