Madhu Yashki Goud : అర్ధరాత్రి నా ఇంటిపై దాడి చేశారు... పోలీసులపై ఈసీకి మధుయాష్కీ ఫిర్యాదు
Telangana Assembly Elections 2023: LB నగర్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్. ఈ మేరకు శనివారం సీఈసీ వికాస్ రాజ్ కు ఫిర్యాదును అందజేశారు.
LB Nagar Assembly constituency: ఎల్ బి నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై…. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ కు శనివారం ఫిర్యాదు చేశారు.ఎల్ బీ నగర్ పోలీసులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అయన ఆరోపించారు.ఇటీవలే అర్థరాత్రి తన ఇంటిపై అనుమతి లేకుండా పోలీసులు తప్పుడు సమాచారంతో దాడి చేసిన విషయాన్ని అయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇళ్లు,ఆఫీసుల పై పోలీసులు ఇష్టానుసారం దాడులు చేస్తున్నారని అయన మండిపడ్డారు.
ఎన్నికల కోడ్ సమయంలో పోలీస్ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలను ఉల్లంఘించి బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు పని చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే ఇలాంటి ఘటనలపై జిల్లా కలెక్టర్,రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక మాజీ ఎంపి అని,నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారని అలాంటి తనతో ఇలా ప్రవర్తించడం సమంజసం కాదన్నారు. నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి ఘటనలు గత ఎన్నికలలో ఎన్నడూ జరగలేదన్నారు మధుయాష్కీ గౌడ్. అనుమతులు లేకుండా తన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎసిపి భీమ్ రెడ్డి,హయాత్ నగర్ సిఐ వెంకటేశ్వర్లు పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి,మంత్రి,ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గి పోలీసులు ఇలా చేయడం బాధాకరమన్నారు.ఈసారి కేసిఆర్ ప్రభుత్వం పాతాళంలోకి వెళ్ళడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన యాష్కీ…. “ఈసీఐ, డీజీపీ కి ఫిర్యాధు చేస్తాము. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోంది. కాంగ్రెస్ ఎక్కడైతే గెలుస్తాందో అక్కడ పోలీసులు డ్రామాలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని హుస్సేన్ సాగర్ లో పాతరెయ్యలని చూస్తున్నారు” అన్నారు మధుయాష్కీ
.