Telangana Rains : రెండు హెలికాప్టర్లను పంపిస్తే ఏం చేస్తున్నారు.. రేవంత్ సర్కారుపై కేంద్రం సీరియస్!
Telangana Rains : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తెలంగాణలో వర్షాలు, వరదలకు సంబంధించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపిస్తే.. ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. వరద సహాయక చర్యల్లో సాయం చేసేందుకు కేంద్రం 7 ఎన్టీఆర్ఎఫ్ బృందాలను పంపింది. అలాగే రెండు హెలికాప్టర్లను కూడా పంపింది. తెలంగాణకు రెండు హెలికాప్టర్లను పంపించి.. హకీంపేటలో ఉంచింది. కానీ వాటిని వినియోగించలేదని తెలుస్తోంది. రెండు హెలికాప్టర్లను పంపినా ఏం చేస్తున్నారని.. లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ప్రశ్నించింది.
నివేదిక పంపండి..
తెలంగాణలో వరదల గురించి ఇప్పటి వరకు ఏ సమాచారం అందలేదని కేంద్రం స్పష్టం చేసింది. రోజూవారి నివేదికను పంపేలా అధికారులను ఆదేశించాలని.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. అయితే.. వర్షాలపై ఇటీవల సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. కేంద్రానికి సవివరంగా లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అది జరిగి 2 రోజులు అవుతోంది.
బండి, ఈటెల పర్యటన..
ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించనున్నారు. రెండు బృందాలుగా ఏర్పడి.. వివిధ జిల్లాల్లో వరద బాధితులను పరామర్శించనున్నారు. బండి సంజయ్ బృందం ఖమ్మం, కోదాడలో పర్యటిస్తుందని బీజేపీ నేతలు చెప్పారు. ఈటెల రాజేందర్ బృందం ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది.
రెండు జిల్లాలపై తీవ్ర ప్రభావం..
తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు.. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిళ్లింది. ఖమ్మం నగరం, మహబూబాబాద్ పట్టణంలో చాలా కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో వరద బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
రేవంత్ భరోసా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించారు. వరద బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు. పంట నష్టంపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. మృతులు, బాధితుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు నేతృత్వంలో ఖమ్మం జిల్లాలో పర్యటించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.