Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం
Etela Rajender Father Death: బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మల్లయ్య అనారోగ్యంతో చనిపోయారు.
Eatala Rajender father passes away: బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఈటల మల్లయ్య (104) అనారోగ్యంతో మృతి చెందారు. ఆరోగ్య సమస్యల కారణంగా మల్లయ్యను సిద్ధిపేటలోని ఆర్వీఎం హాస్పిటల్‌లో చేర్పించగా.. మంగళవారం రాత్రి డాక్టర్లు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించిన కొద్దిసేపట్లోనే మరణించినట్లు ప్రకటించారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.17 గంటలకు తన తండ్రి మృతి చెందినట్లు ఈటల రాజేందర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లోని స్వగృహంలో మల్లయ్య పార్థీవ దేహాన్ని ఉంచి.. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మల్లయ్యకు 8 మంది సంతానం కాగా.. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఈటల రాజేందర్ రెండో కుమారుడు.
తండ్రి ఆరోగ్యం సమాచారం అందిన వెంటనే… ఈటల ఆస్పత్రికి వెళ్లారు. మంగళవారం మొత్తం అక్కడే ఉన్నారు. ప్రస్తుతం స్వగ్రామానికి చేరుకున్న ఆయన… దశదిన కర్మల వరకు ఆయన అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ లో సుదీర్ఘ కాలం పని చేసిన ఈటల రాజేందర్... అధికారంలోకి వచ్చాక రెండుసార్లు మంత్రిగా పని చేశారు. రెండోసారి మంత్రిగా ఉన్న ఆయనపై... అసైన్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు రావటంతో కేబినెట్ నుంచి తొలగించారు. అనంతర పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ తో పాటు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. బీజేపీలో చేరిన ఆయన.. ఉప ఎన్నికలో విక్టరీ కొట్టారు.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని ప్రముఖులతో చర్చలు జరుపుతూ... బీజేపీలో చేరేలా చూస్తున్నారు. ఇక తాజాగా మునుగోడులో బైపోల్ రావటంతో... అక్కడ కూడా ఈటల పావులు కదుపుతున్నారు. ఇప్పటికే స్థానిక నేతలతో చర్చలు జరుపుతూ.. పలువురిని పార్టీలో చేర్పించారు.
సంబంధిత కథనం
టాపిక్