గవర్నర్‌ను సీఎం కేసీఆర్ అవమానించారు: ఈటల రాజేందర్
గణతంత్ర దినోత్సవం రోజే కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. తాను హాజరయ్యే పరిస్థితి లేకపోతే సీనియర్ మంత్రినైనా పంపించి ఉండాల్సిందని అన్నారు.
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు వెళ్లకుండా గవర్నర్‌ను సీఎం కేసీఆర్ అవమానించారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఉద్దేశపూర్వకంగానే ఆయన వెళ్లలేదని, గవర్నర్‌గా ఎవరు ఉన్నా.. ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలని ఈటల అన్నారు.
స్పీకర్ హోదాలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆ పదవికి వన్నె తీసుకురాదంటూ స్పీకర్ పోచారంపై విమర్శలు గుప్పించారు ఈటల రాజేందర్. ఇది రాజ్యాంగంపై విషం కక్కడమే అని, స్పీకర్ హోదాలో మాట్లాడకూడని మాటలు ఆయన మాట్లాడారని అన్నారు.
పోచారం మాటలు వింటుంటే.. సీఎం కేసీఆర్ కావాలనే రాజ్‌భవన్‌కు వెళ్లలేదని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, ఇది బెంగాల్ కాదు.. తెలంగాణ అని టీఆర్‌ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేదని, శాంతిభద్రతలు కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. మాటలతో ప్రజలను ఒప్పించే సత్తాను సీఎం కోల్పోయారని, అందుకే ఇలా దాడులు చేస్తున్నారని ఆరోపించారు.