Karimnagar Politics : అమ్మవారి సన్నిధిలో కలిసిన రాజకీయ ప్రత్యర్థులు..!
రాజకీయ ప్రత్యర్థులైన బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ కలిశారు. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ… కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్ర స్థాయిలో బండి సంజయ్, రాష్ట్ర స్థాయిలో తాను కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.
పండుగ వేళ రాజకీయ ప్రత్యర్థులు కలిశారు. దేశంలో కాంగ్రెస్, బిజెపి మధ్య పచ్చి గడ్డి వేస్తే బొగ్గు మనేస్థాయిలో రాజకీయ విభేదాలు ఉన్న వేళ అమ్మవారి సన్నిధిలో ఏకమయ్యారు. చూపరులను ఆశ్చర్యానికి గురి చేశారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఎదిగి ఒకరు కేంద్ర మంత్రిగా, మరొకరు రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆ ఇద్దరు నేతలు రాజకీయంగా బద్ధ శత్రువులే అయినప్పటికీ ఇద్దరు అన్నదమ్ముల వలే కలిసి అమ్మవారి సన్నిధిలో భక్తులకు దర్శనమిచ్చారు.
ముగ్గురు అమ్మలు కొలువైన కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రాజకీయ ప్రత్యర్థులను కలుపుతుంది. రాజకీయ ప్రత్యర్థులను, అంతకుమించి రాజకీయంగా బద్ధ శత్రువులను ఏకం చేస్తుంది. అమ్మవారి మహిమో లేక మరేమైన విశేషమో తెలియదు కానీ రాజకీయ పార్టీల నేతలను ఐక్యం చేస్తుంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాశక్తి ఆలయంలో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ నాయకులు కలిసిపోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి చెందిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్… ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బండి సంజయ్ సోదరుడు - మంత్రి పొన్నం
కేంద్ర మంత్రి బండి సంజయ్, తాను వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం రాజీలేకుండా పనిచేస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆలయ నిర్వాహకులు పొన్నంకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి మహాశక్తి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంజయ్ తో కలిసి ఆలయ ఆవరణలో నిర్వహించిన దాండియా కార్యక్రమాలను తిలకించారు.
విద్యార్ధి రాజకీయాల నుండి తాను, బండి సంజయ్ క్రియాశీలకంగా పనిచేస్తూ మంత్రి స్థాయికి ఎదిగామన్నారు. రాజకీయాలు వేరు. మేం వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కరీంనగర్ అభివృద్ధి విషయంలో మాత్రం రాజీ లేకుండా కలిసి పనిచేస్తామని తెలిపారు. గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో శ్రమ పడి ప్రజల కోసం పనిచేస్తున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కేంద్ర స్థాయిలో బండి సంజయ్, రాష్ట్ర స్థాయిలో తాను జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమ్మవారి దయతో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామన్నారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాశక్తి ఆలయంలో వైభవంగా మహిషాసుర మర్ధిని నిర్వహించారు. రుద్ర సహిత చండీ యాగంలో బండి సంజయ్ కుమార్ పాల్గొని భవానీ దీక్ష విరమించారు. రాత్రి జరిగిన మహిషాసుర మర్దినిలో పాల్గొని టపాసులు కాల్చి మహిషాసురుడిని అగ్నికి అహుతి చేశారు. విజయదశమి దసరా సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో దసరా సందర్భంగా నిర్వహించే షమీ పూజసహా పలు కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు.
పవిత్రమైన విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘చెడుపై మంచి విజయం సాధించిన రోజు విజయదశమి అని, చెడు ఆలోచనలను వీడి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతో నిత్య జీవితం గడపాలి. అలాంటి వారు కోరిన కోరికలు తీర్చాలని అమ్మవారిని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.