Narayana College Student : బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య, తల్లిదండ్రులు వెళ్లిన కాసేపటికే!
Narayana College Student : హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన యువతిని...ఆమె తల్లిదండ్రులు ఆదివారం హాస్టల్ దిగబెట్టారు. తల్లిదండ్రులు వెళ్లిన కాసేపటికే యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అనూష(16) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా...వీరిలో రెండో కుమార్తె అనూష (16) బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది.
దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన అనూషను ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులు హాస్టల్లో వదిలివెళ్లారు. తల్లిదండ్రులు నగరం దాటేలోపే అనూష స్పృహ కోల్పోయిందని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లేసరికి అనూష ఊరి వేసుకొని చనిపోయిందని నారాయణ సిబ్బంది తెలిపారు. తల్లిదండ్రులు వచ్చేసరికి విద్యార్థిని మృతదేహాన్ని కాలేజీ సిబ్బంది, బాచుపల్లి పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. తమ బిడ్డ అనూష ఆత్మహత్యకు నారాయణ కాలేజీ సిబ్బందే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనూష మృతిపై ఆమె తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బాచుపల్లి నారాయణ కాలేజీ ముందు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థిని బంధువులు నారాయణ కాలేజీలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అనూష...నిన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఇటీవలే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ తనిఖీలు
బాచుపల్లి లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇటీవలె తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. గత కొన్ని రోజులుగా నారాయణ కాలేజీలో సమస్యల పట్ల పలువురు విద్యార్థినిలు, తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో సీరియస్ గా తీసుకున్న కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారద బాచుపల్లి నారాయణ కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీ ప్రాంగణంలోనూ విద్యార్థినిల హాస్టళ్లు, మెస్ లను తనిఖీ చేసి నాసిరకమైన ఫుడ్, హాస్టల్ లలో సౌకర్యాలు సరిగా లేవని గుర్తించి కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. అదే విధంగా అక్కడి విద్యార్థిలతో కాసేపు మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు .