Yadadri Train : హైదరాబాద్ టు యాదాద్రి.. త్వరలో ఏ కష్టం లేకుండా వెళ్లిపోవచ్చు!
Yadadri Train : హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లాలంటే ఇప్పటివరకు బస్సులు, ప్రైవేట్ వాహనాలే దిక్కు. దీంతో ట్రాఫిక్ కష్టాలు త్పపేవి కావు. అటు సమయం కూడా ఎక్కువ పడుతోంది. ఈ నేపథ్యంలో.. కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులను పొడిగించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించినట్లు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని వ్యాఖ్యానించారు. దీంతో భక్తులు చాలా సులువుగా యాదాద్రికి చేరుకోవచ్చని కిషన్ రెడ్డి వివరించారు. వీలైనంత్ త్వరగా పనులు పూర్తి చేసి.. భక్తులకు రైలు సౌకర్యం కల్పిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో తీర్చి దిద్దుతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. ఈ పనులను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. సౌత్ ఇండియాలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తీర్చుదిద్దుతున్నామని వివరించారు. దీన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు అంకితం చేస్తారని వ్యాఖ్యానించారు.
రూ.430 కోట్లతో కొనసాగుతున్న చర్లపల్లి టెర్మినల్ నిర్మాణ పనులను కిషన్‌రెడ్డి పరిశీలించారు. అమృత్ పథకంలో భాగంగా స్థానికంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. రూ.430 కోట్లతో చర్లపల్లి, రూ.715 కోట్లతో సికింద్రాబాద్, రూ.429 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్‌లలో పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్ మానిఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి వివరించారు.
మార్పును గమనించాలి..
దక్షిణ మధ్య రైల్వే.. మూడు రైళ్ల ప్రయాణ సమయవేళలను మార్చింది. లింగంపల్లి- తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- గూడురు సింహాపురి ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ సమయాన్ని మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మార్పును గమనించాలని ప్రయాణికులకు సూచించింది.