Medak Murder: మెదక్ జిల్లాలో దారుణం: తాగిన మత్తులో బిక్షగాడిని కొట్టి చంపిన ఇద్దరు యువకులు-atrocity in medak district two youths beat a beggar to death ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Murder: మెదక్ జిల్లాలో దారుణం: తాగిన మత్తులో బిక్షగాడిని కొట్టి చంపిన ఇద్దరు యువకులు

Medak Murder: మెదక్ జిల్లాలో దారుణం: తాగిన మత్తులో బిక్షగాడిని కొట్టి చంపిన ఇద్దరు యువకులు

HT Telugu Desk HT Telugu
Sep 11, 2024 05:42 AM IST

Medak Murder: మెదక్ జిల్లాలో అత్యంత దారుణ సంఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం కోల్పోయి, బిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు దొంగగా అనుమానించారు. అతనిని విచక్షణ రహితంగా కొట్టి, అనంతరం బైక్ కు కట్టి కొంతదూరం ఈడ్చుకెళ్ళి హతమార్చారు.

మెదక్‌లో భిక్షగాడిని కొట్టి చంపిన యువకులు
మెదక్‌లో భిక్షగాడిని కొట్టి చంపిన యువకులు (HT_PRINT)

Medak Murder: మెదక్ జిల్లాలో అత్యంత దారుణ సంఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం కోల్పోయి, బిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు దొంగగా అనుమానించారు. అతనిని విచక్షణ రహితంగా కొట్టి, తన కాళ్ళ మీదుగా బైక్ నడిపి, వారి బైక్ కు కట్టి కొంతదూరం ఈడ్చుకెళ్ళి హతమార్చారు.

ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లాలో సెప్టెంబర్ 4 రాత్రి జరిగింది, కానీ తగిన ఆధారాలు లేకపోవటం వలన ఆలస్యంగా వెలుగు చూసింది. మెదక్ ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో గత కొద్దీ రోజులుగా మతిస్థిమితం లేని ఓ వ్యక్తి బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాను సుమారుగా 40 నుండి 45 సంవత్సరాల వయసు కలిగి, హిందీ మాత్రమే మాట్లాడుతూ ఉండేవాడు.

బైక్ కు కట్టి ఈడ్చుకెళ్లారు.....

సెప్టెంబర్ 4 వ తేదీ రాత్రి ఈ వ్యక్తి గోమారం గ్రామంలో బస్టాండ్ లో నిద్రించాడు. అయితే గ్రామంలో జరిగిన ఒక దొంగతనం తానే చేశాడని అనుమానించి, మద్యం మత్తులో ఉన్న గోమారం గ్రామానికి గంగిరెడ్డి తిరుపతి రెడ్డి, పందికొక్కుల మణికంఠ గౌడ్ లు తనను దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా దొంగతనం ఎక్కడెక్కడ చేసావంటూ రోడ్డు పైకి ఈడ్చుకెళ్లారు.

అతడు కొట్టొదని ఎంత వేడుకున్న కనికరించలేదు. బైక్ కు కట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లి, అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఇద్దరు కలిసి విచక్షణ రహితంగా కొట్టి , ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలై ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదంతా బస్టాండ్ సమీపంలోని సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది.

దెబ్బల వలెనే చనిపోయాడని తేల్చిచెప్పిన డాక్టర్లు.…

5 న గుర్తు తెలియని వ్యక్తి గ్రామ పంచాయతీ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. 6 వ తేదీన నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష చేయించి, అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, పోస్టుమార్టం చేసిన డాక్టర్లు తనకు ఎవరో కొట్టడం వలెనే మరణించాడని తేల్చిచెప్పారు.

ఆ దిశగా పరిశోధన చేసిన పోలీసులు, గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించడం వలన హంతకులను గుర్తించారు. ఆ వ్యక్తి మృతికి కారకులైన ఇద్దరిని సోమవారం అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు ఎస్పీ వివరించారు. తాగిన మైకంలో మతిస్థిమితం లేని వ్యక్తిపై నిర్ధాక్షిణ్ణంగా ప్రవర్తించి అతని ప్రాణాలు తీసారని పేర్కొన్నారు. ఆ వ్యక్తి మృతికి కారణమైన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ వివరించారు.

రాజకీయ నాయకుల ప్రమేయం తో అరెస్ట్ ఆలస్యం.…

అయితే, ఈ సంఘటన వెలుగులోకి రాకుండా చేయడానికి, యువకులను కాపాడడానికి ఒక మండల నాయకుడు తీవ్రంగా ప్రయత్నం చేసాడని, అందుకే వారి అరెస్ట్ లేట్ అయ్యిందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.తిరుపతి రెడ్డి డ్రైవర్ గా పని చేస్తుండగా, మణికంఠ ఒక పార్టీ యువజన విభాగంలో చాల రోజులుగా చురుకుగా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.