October 29 Telugu News Updates : బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జీషీట్-andhrapradesh and telangana telugu live news updates 29 october 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  October 29 Telugu News Updates : బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జీషీట్

ఏపీ తెలంగాణ తాజా వార్తలు

October 29 Telugu News Updates : బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జీషీట్

04:09 PM ISTOct 29, 2022 09:39 PM Mahendra Maheshwaram
  • Share on Facebook

  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. అప్ డేట్స్ కోసం పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Sat, 29 Oct 202204:09 PM IST

ఏపీ ప్రభుత్వానికి గ్లోబల్‌ డిజిటల్‌ అవార్డు

ఏపీ ప్రభుత్వానికి గ్లోబల్‌ డిజిటల్‌ అవార్డు దక్కింది. అవార్డును ఏపీ వైద్యశాఖ మంత్రి విడదల రజిని అందుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ.. ఏపీలో 80 శాతం హెల్త్‌ కార్డులను డిజిటలైజ్‌ చేశామని చెప్పారు. ఆరోగ్యశ్రీ  ద్వారా కోట్లాదిమంది లబ్ధి పొందుతున్నారని,  మెడికల్‌ కాలేజీలు పెంచి వైద్య విద్యను బలోపేతం చేస్తున్నాము అని స్పష్టం చేశారు.

Sat, 29 Oct 202202:33 PM IST

యాదాద్రి దేవస్థానంలో బ్రేక్ దర్శనం

యాదాద్రి దేవస్థానంలో ఈ నెల 31వ తేదీ నుండి బ్రేక్ దర్శన సదుపాయం అమల్లోకి రానుంది.  స్వామి వారి దర్శనానికి వచ్చే వీఐపీ మరియు వీవీఐపి భక్తులకు,రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్ తో బ్రేక్ దర్శనం కల్పిస్తారు.  ఉదయం 9 నుండి 10 గంటల వరకు...సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం ఉంటుంది.  బ్రేక్ దర్శన సమయంలో ఉచిత దర్శనం,టికెట్ దర్శనం నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. 

Sat, 29 Oct 202201:55 PM IST

మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై సీఈసీ నిషేధం

మునుగోడు ఉప ఎన్నికలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.  మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై  నిషేధం  విధించారు.  కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు  తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించారు.  జగదీష్‌ రెడ్డి  సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించారు. ఇంటర్వ్యూలు సైతం ఇవ్వకూడదని సీఈసీ నిషేధం విధించింది. 

Sat, 29 Oct 202212:38 PM IST

పార్టీ నేతలతో పవన్ భేటీ

మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్,  విశాఖలో జైలుకెళ్లి, బెయిల్ పై వచ్చిన నేతలు, వారి కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు.  9 మంది నేతలను పలకరించి, శాలువాలతో సన్మానించారు.  విశాఖ ఘటనలో  ఎదురైన ఇబ్బందులను పవన్ కు  జనసేన నేతలు వివరించారు.  నేతలకు, వారి కుటుంబసభ్యులకు పార్టీ అండగా ఉంటుందని పవన్ హామీఇచ్చారు.  ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 

Sat, 29 Oct 202212:36 PM IST

ఏపీ డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ

ఏపీ డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. నెల్లూరు జిల్లా టీడీపీ నేత మాతంగి వెంకట కృష్ణపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు మాతంగి వెంకటకృష్ణపై దాడికి పాల్పడ్డారని లేఖలో  అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు.  పోలీసుల అండతోనే వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

Sat, 29 Oct 202212:35 PM IST

ఫిరాయింపుదారులంతా టిఆర్‌ఎస్‌లోనే….

బంగారు తెలంగాణ మోడీ స్వప్నమని,  కేసీఆర్ కుటుంబం అవినీతి, దోపిడీకి కేరాఫ్ గా మారిందని తరుణ్‌ చుగ్ ఆరోపించారు.  కేసీఆర్ ఎలాంటి మాయలు చేస్తున్నారో ప్రజలకు తెలుసని,  ఫిరాయింపుదారులంతా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ఆరోపించారు.  ఎమ్మెల్యేల వ్యవహారం ఓ కట్టుకథ అని,  రోహిత్ రెడ్డిపై కర్నాటకలో డ్రగ్ కేసు ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగఓటు వేశారని ఆరోపణలున్నాయని విమర్శించారు. 

Sat, 29 Oct 202212:33 PM IST

పోలీసుల అదుపులో ఎమ్మెల్యేలకు ఎర నిందితులు

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  ముగ్గురు నిందితులు నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజిలను  సైబరాబాద్ పోలీసులు  అదుపుపులోకి తీసుకున్నారు. నిందితులను మొయినాబాద్ పీఎస్ కు తరలించారు. ముగ్గురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత  ఏసీబీ కోర్టులోహాజరుపర్చనున్నారు.

Sat, 29 Oct 202210:45 AM IST

ఏపీలోని పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి

ఏపీలోని పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లరావు డిమాండ్  చేశారు.మూడు రాజధానుల రాజకీయానికి ప్రధాని చెక్ పెట్టాలని,  కేంద్రం తలుచుకుంటే క్షణాల్లో అమరావతి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.  ఏపీలో వైసీపీ మళ్లీ విభజన రాజకీయం చేస్తోందని  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

Sat, 29 Oct 202209:40 AM IST

హిందూపురంలో సోమవారం బంద్

హిందూపురంలో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ గో బ్యాక్ నినాదంతో బంద్ కు పిలుపునిచ్చారు. సోమవారం హిందూపురం బంద్ కు వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. హత్యా రాజకీయాలను అరికట్టడమే లక్ష్యంగా నేతలు సమావేశమయ్యారు. వైసీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి హత్య కేసుపై సమావేశంలో చర్చించారు. ఇక్బాల్ ను ఏ1గా, గోపికృష్ణను ఏ2 నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. 

Sat, 29 Oct 202209:52 AM IST

ఫామ్‍హౌస్ కేసుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఫామ్‍హౌస్ కేసుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  చట్టం తన పని తాను చేస్తుందన్నారు.  ఏదైనా మాట్లాడితే ప్రభావితం చేశారని అంటారని,   దొంగెవరో.. దొర ఎవరో ప్రజలకు తెలిసిందన్నారు.  దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడనని,  ఈ అంశం కోర్టులో ఉన్నందున ఏమీ మాట్లాడనని చెప్పారు.  సందర్భాన్ని బట్టి సీఎం కేసీఆర్ మాట్లాడతారన్నారు.  ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమవుతాయా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.   చెప్పులు మోసిన చేతులతో ప్రమాణాలు చేయడం తగదని,   గుజరాత్ చెప్పులు మోసిన చేతులతో యాదాద్రిలో ప్రమాణం చేయడం పాపమన్నారు.  ప్రమాణం చేసినందుకు యాదాద్రిలో సంప్రోక్షణ చేయాలన్నారు.  రేపిస్టులకే బీజేపీ నేతలు దండలు వేసి ఊరేగిస్తున్నారని,  ఇక వారు చేసే ప్రమాణాలకు ఏం విలువ ఉందని  మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

Sat, 29 Oct 202207:41 AM IST

టీఆర్ఎస్ ఛార్జీషీట్

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జీషీట్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… పలు సమస్యలను ప్రస్తావించారు. ఏ ప్రధాని చేయని విధంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించారని ఆరోపించారు. మునుగోడు ప్రజల తరపున ఈ ఛార్జీషీట్ వేస్తున్నామని చెప్పారు. బీజేపీ ఏం చేసిందో చెప్పకుండా సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Sat, 29 Oct 202207:03 AM IST

హైకోర్టు కీలక తీర్పు….

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల రిమాండ్‌ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ తాజా ఆదేశాలు ఇచ్చింది. నిందితులను పోలీసుల ఎదుట లొంగిపోలవాలని ఆదేశించింది.

Sat, 29 Oct 202206:05 AM IST

3 రాజధానులకు మద్దతుగా ర్యాలీ… 

మూడు రాజధానుల ఉద్యమాన్ని నెమ్మదిగా ట్రాక్ ఎక్కిస్తోంది అధికార వైసీపీ. ఇప్పటికీ వైజాగ్ వేదికగా భారీ ర్యాలీ నిర్వహించగా... ఇవాళ తిరుపతిలో చేపట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో... రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన ర్యాలీ తలపెట్టారు. ఈ ర్యాలీలో రాయలసీమ జిల్లాల నుంచి తరలివచ్చిన జనం భారీగా పాల్గొన్నారు. కృష్ణాపురం, గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా ఈ మహా ప్రదర్శన సాగనుంది. రాయలసీమ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్టుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

Sat, 29 Oct 202204:50 AM IST

రాజాసింగ్ కేసుపై విచారణ…

ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదైన పీడీయాక్ట్ పై అడ్వైజరీ బోర్డు కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను కమిటీ సమర్ధించింది. పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని కమిటీ కూడా తిరస్కరించింది. ఇదే విషయాన్ని తెలంగాణ పోలీసులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజాసింగ్‌ సతీమణి ఉషాబాయి దాఖలు చేసిన పిటిషన్‌ పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగానే కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో శుక్రవారం పోలీసులు...న్యాయస్థానంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

గతంలో రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను కూడా కౌంటర్ పిటిషన్ లో జతచేశారు. పీడీ యాక్ట్ కింద ఆయన్ను నిర్బంధించడాన్ని సలహా మండలి ఆమోదించిందందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన్ను 12 నెలల పాటు నిర్బంధిస్తూ అక్టోబరు 19న ఉత్తర్వులు జారీ చేశానని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

Sat, 29 Oct 202204:23 AM IST

నియామకం

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.వి.విజయబాబును ప్రభుత్వం నియమించింది. శుక్రవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.

Sat, 29 Oct 202203:16 AM IST

ఇవాళే కీ 

TSPSC Group-1 Exam : తెలంగాణ గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ ఇవాళ (అక్టోబర్ 29) విడుదల కానుంది.

Sat, 29 Oct 202203:16 AM IST

రిమాండ్ రిపోర్టు… 

Four TRS MLAs Poaching'Case: మునుగోడు ఎన్నికకు సరిగ్గా టైం దగ్గరపడుతున్న వేళ ఎమ్మెల్యేల బేరసారాల కథ సంచలనంగా మారింది.రూ. 400 కోట్ల ఆఫర్ తో చేపట్టిన ఆపరేషన్ ను పోలీసులు భగ్నం చేయటం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ కాస్త... బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లు మారిపోయింది. అయితే ఈ కథ అంతా ఎమ్మెల్యేల సహకారంతో పోలీసులు సైలెంట్ గా స్కెచ్ గీసినట్లు అర్థమవుతోంది. తాజాగా పోలీసులు హైకోర్టుకు చెప్పిన ప్రకారం చూస్తుంటే... పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది.

హైకోర్టుకు సైబరాబాద్ పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మరిన్ని సంచలన విషయాలు ఉన్నాయి. అక్టోబరు 26న అసలు ఫామ్‌ హౌస్‌లో ఏం జరిగింది? నిందితులను ట్రాప్ చేసి ఎలా పట్టుకున్నారో క్లియర్ కట్ గా వివరించారు. ఫామ్‌మౌస్‌లో కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు రోహిత్ రెడ్డి జేబుల్లో వాయిస్ రికార్డర్లు ఉంచినట్లు చెప్పారు. అక్కడ జరిగిన మూడు గంటల తతంగాన్ని మొత్తం కెమెరాల్లో బంధించారు. కొబ్బరి నీళ్లు తీసుకురా అనే ఈ ఒక్క మాటతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఈ ప్రలోభాల కుట్రను బట్టబయలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.

Sat, 29 Oct 202202:29 AM IST

చలి వణికిస్తోంది… 

వర్షాకాలం(Rain Season) ముగియడంతో రాష్ట్రంలో క్రమంగా చలి పెరుగుతోంది. నవంబర్ ప్రారంభంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ(IMD) అధికారులు భావిస్తున్నారు. అయితే అక్టోబర్ చివరి వారంలోనే చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటలు కూడా కాకుండానే.. చలి పెరుగుతోంది. ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది.

తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో శీతల గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం పూట పొడి వాతావరణం ఉంటుందని వాతారణశాఖ పేర్కొంది. రాత్రివేళల్లో చలి వాతావరణం ఉంటుందని తెలిపింది. మరోవైపు శుక్రవారం పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరంభీం జిల్లా సిర్పూరులో 12.5 డిగ్రీలు, మెదక్‌లో 13.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

Sat, 29 Oct 202201:58 AM IST

షెడ్యూల్ విడుదల… 

రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ఈ షెడ్యూల్‌ లోని పోస్టులన్నింటికీ జనరల్‌ స్టడీస్‌ మెంటల్‌ ఏబిలిటీ పరీక్ష నవంబర్‌ 7న జరగనుంది. ఇది అన్ని పోస్టులకు కామన్‌ పేపర్‌ గా ఉంటుందని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

Sat, 29 Oct 202201:27 AM IST

సభ రద్దు….

ఈనెల 31న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ ఉండనున్నట్లు 2 రోజుల కిందట అధికారికంగా తెలిపారు. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా ముఖ్య అతిధిగా రానున్నట్లు ప్రకటించారు. కానీ అనూహ్యంగా సభను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. . నియోజకవర్గంలోని ఆయా మండలాల వారీగా సభలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది.

Sat, 29 Oct 202201:02 AM IST

కాంగ్రెస్ మేనిఫెస్టో…

19 అంశాలతో మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను రూపొందించింది.  శుక్రవారం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మునుగోడుకు సంబంధించిన పలు అంశాలు ఇందులో ఉన్నాయి.

Sat, 29 Oct 202201:02 AM IST

మంత్రికి నోటీసులు

మంత్రి జగదీష్‌ రెడ్డికి ఈసీ షాక్ ఇచ్చింది. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందవంటూ జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం... జిల్లా ఎన్నికల అధికారితో మాట్లాడి నివేదిక తెప్పించారు. మంత్రి ఎన్నికల ప్రవర్తన నియమావళని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 29 మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.