Congress vs BRS : అసెంబ్లీలో సీన్ రివర్స్... తొలిసారిగా అధికారపక్షంలో కాంగ్రెస్ - ప్రతిపక్షస్థానంలో బీఆర్ఎస్
Telangana Assembly Sessions 2023: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…తొలిసారిగా అసెంబ్లీలో అధికారపక్షంలో కూర్చుంది. పదేళ్లపాటు పవర్ లో ఉన్న బీఆర్ఎస్… ప్రతిపక్ష స్థానంలో ఉంది.
Telangana Assembly Sessions 2023: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకే సభ ప్రారంభం కాగా… ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ చైర్ లో కూర్చున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో… ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర, పొన్నంతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.
తొలిసారిగా అధికారపక్షంలో….
తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా అధికారపక్షంలో కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. పదేళ్లపాటు ప్రతిపక్ష స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ… ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకొని సింగిల్ గానే అధికారంలోకి వచ్చింది. వారి మిత్రపక్షం సీపీఐకి వచ్చిన ఒక్కసీటుతో కలుపుకొని వారి బలం 65కి చేరింది. ఇక పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్… ప్రతిపక్షానికి కేటాయించిన సీట్లలో కూర్చుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో సరిపెట్టుకున్న ఆ పార్టీ…. ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. తొలిసారిగా అధికారపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో జోష్ కనిపించింది. ఇక ప్రతిపక్షం అడిగే ప్రశ్నలతో పాటు ప్రభుత్వం చేపట్టబోయే పనుల వివరాలను చెప్పనుంది అధికార కాంగ్రెస్.
సీఎల్పీ నేతగా రేవంత్… ప్రతిపక్ష నేతగా కేసీఆర్
మరోవైపు కాంగ్రెస్ సీఎల్పీ నేతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఖరారైంది. ఆయనే ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితుల రీత్యా… సభకు రాలేదు. త్వరలోనే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో పార్టీల బలాలు:
కాంగ్రెస్ - 64
బీఆర్ఎస్ - 39
బీజేపీ - 08
ఎంఐఎం - 07
సీపీఐ - 01