Medak Crime: మూగ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో ముద్దాయికి ఏడేళ్ల జైలు శిక్ష, 5 వేల జరిమానా..-accused sentenced to 7 years in prison and fined 5 thousand in the case of attempted murder ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Crime: మూగ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో ముద్దాయికి ఏడేళ్ల జైలు శిక్ష, 5 వేల జరిమానా..

Medak Crime: మూగ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో ముద్దాయికి ఏడేళ్ల జైలు శిక్ష, 5 వేల జరిమానా..

HT Telugu Desk HT Telugu
Sep 13, 2024 01:37 PM IST

Medak Crime: మాటలు రాని మూగ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో నేరస్తునికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ గౌరవ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎం.రాధా కృష్ణ చౌహాన్ గురువారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు.

మూగవ్యక్తిపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష
మూగవ్యక్తిపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష (HT_PRINT)

Medak Crime: మూగమనిషిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్షను విధించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మద్దూరి వీరయ్య (40) కల్లు వ్యాపారం చేస్తుండేవాడు. కాగా వీరయ్య కల్లు దుకాణంలో పగిలిన గాజు సీసా ముక్కలను అదే గ్రామానికి చెందిన కుమ్మరి యాదయ్య (45) ఇంటి పక్కన గల ఖాళీ స్థలంలో వేస్తున్నాడు.

ఇది గమనించిన యాదయ్య, తనకు మాటలు రాకపోవడంతో మూగ సైగలు చేస్తూ నా స్థలంలో ఎందుకు వేస్తున్నావని వీరయ్యను అడిగాడు. దీంతో ఆగ్రహించిన వీరయ్య నీ స్థలం ఎక్కడుంది రా! అంటూ యాదయ్యతో గొడవకు దిగాడు. అదే సమయంలో అక్కడికి వీరయ్య బామ్మర్ది శ్రీనివాస్ గౌడ్ వచ్చాడు.

మాంసం నరికే కత్తితో …

యాదయ్యతో గొడవ పడుతుండగా గమనించిన కొడుకు శ్రీకాంత్, యాదయ్య తమ్ముడు సంగమేశ్వర్లు కూడా అక్కడికి వచ్చారు. తాగిన మైకంలో ఉన్న మద్దూరి వీరయ్య ఇంటి లోపలికి వెళ్లి మాంసం నరికే కత్తిని తీసుకొని వచ్చి యాదయ్య తలపై ఎడమ భాగంలో నరికాడు. దీంతో బలమైన రక్త గాయాలైన యాదయ్య కింద పడిపోగా, యాదయ్య తమ్ముడైన సంగమేశ్వరుని కూడా గాయపరిచాడు. వెంటనే వారు సదాశివపేట పోలీస్ స్టేషన్ లో వీరయ్యపై పిర్యాదు చేశారు.

ఈ ఘటనపై అప్పటి సదాశివపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును ఎస్ఐ గోపాల్ దర్యాప్తు పూర్తి చేసి నేరస్తున్ని కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ కేసు పూర్వపరాలను విన్న గౌరవ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎం.రాధా కృష్ణ చౌహాన్ నిందితులకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. నేరస్తునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అభినందించారు.

మెదక్ లో సెల్ ఫోన్ దొంగల ముఠా అరెస్ట్ .…

సెల్ ఫోన్లు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 17 సెల్ ఫోన్ లతో పాటు రూ. 5000, ఒక షిప్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారులో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.

వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించగా సెల్ ఫోన్ ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. నింధితులు ఆంద్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా డోన్ కు చెందిన ఈడిగ రవికుమార్ గౌడ్, కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన సత్పాడి అరవింద్ తో పాటు మరో ఇద్దరు మైనర్లుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుండి 17 సెల్ ఫోన్ లతో పాటు రూ. 5000, ఒక షిప్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివానందం తెలిపారు.