TG Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ స్కామ్ - మాజీ మంత్రి ఓఎస్డీతో పాటు మరో అధికారి అరెస్ట్
Telangana Sheep Distribution Scam Updates : గొర్రెల పంపిణీ స్కామ్ లో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకోగా…తాజాగా మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు.
Telangana Sheep Distribution Scam Updates : గొర్రెల పంపిణీ స్కామ్ డొంక కదులుతుంది. ఈ కేసును ఏసీబీ విచారిస్తుండగా…. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. అయితే శుక్రవారం మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు.
పశుసంవర్థకశాఖ మాజీ సీఈ రాంచందర్‌రావు, కల్యాణ్ కుమార్(మాజీ మంత్రి మాజీ ఓఎస్డీ) అరెస్టయ్యారు. వీరిద్దరూ కలిసి కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై దాదాపుగా 2.10 కోట్ల రూపాయల నష్టం కలిగించారని ఏసీబీ తెలిపింది. అరెస్ట్ చేసిన వీరిని కోర్టులో హాజరుపరిచి… రిమాండ్ కు తరలించారు. మరికొందరి పాత్రపై కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు అధికారులు అరెస్ట్ అయినట్లు ఏసీబీ పేర్కొంది.
గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో దీనిపై కొత్త ప్రభుత్వం ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. కొద్దిరోజులుగా విచారణను ముమ్మరం చేసింది.
గొర్రెల పంపిణీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలోని యాదవ, కురుమ వర్గాలకు చెందిన వారికి ప్రభుత్వం నుండి సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసేందుకు తీసుకొచ్చారు. విడతల వారీగా లబ్ధిదారులకు సబ్సిడీ కింద గొర్రెలను పంపిణీ చేసింది. అయితే ఈ పథకంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలపై గచ్చిబౌలిలో కేసు నమోదైంది. ఈ కేసును గచ్చిబౌలి పోలీసులు ఏసీబీకి బదిలీ చేశారు.
ఏసీబీ ఎంట్రీతో ఈ స్కామ్ కు సంబంధించిన డొంక కదులుతుంది. స్కీమ్ లో కీలకంగా వ్యవహరించిన అధికారులు, కాంట్రాక్టర్లను విచారిస్తోంది.రికార్డులను పరిశీలించడంతో పాటు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తోంది. కాగ్ నివేదికలో కూడా ఈ స్కీమ్ లోని పలు అంశాలను ప్రస్తావించింది. ఈ వివరాలను కూడా ఏసీబీ అధికారులు… పరిశీలిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
గత ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్డీగా చేసిన కల్యాణ్ ప్రస్తుతం అరెస్ట్ కావటం సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో రాజకీయ ప్రమేయంపైనా కూడా ఏసీబీ గురిపెట్టినట్లు తెలుస్తోంది. నిందితుల్ని విచారించి వారి నుంచి మరిన్ని వివరాలను రాబట్టే యోచనలో ఉంది. వీరిని కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలపై కూపీ లాగాలన భావిస్తోంది.
ఏసీబీకి చిక్కిన అధికారులు…
మరోవైపు గత కొంతకాలంగా తెలంగాణ ఏసీబీ విస్తృతంగా సోదాలు చేస్తోంది. శుక్రవారం పలుశాఖల్లో పని చేస్తున్న అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వనపర్తిలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్, స్తంభాల ఏర్పాటుతో పాటుగా 2,11400 బిల్ సెటిల్ మెంట్ కొరకు ఓ వ్యక్తి దగ్గర రూ. 19వేలు తీసుకుంటు ముగ్గురు విద్యుత్ శాఖ అధికారులు పట్టుబడ్డారు. వీరిలో P. నాగేంద్ర కుమార్ - సూపరింటెండ్ ఇన్ ఇంజనీర్, M. నరేంద్ర కుమార్ - డివిజనల్ ఇంజనీర్ మరియు మధుకర్ - అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నారరని ఏసీబీ వెల్లడించింది.
ఇక ఓ కేసులోలంచం తీసుకుంటూ కాచిగూడ సీఐతో పాటు ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.