ఆర్టీవో కార్యాలయంలో అవినీతి దందా.. ఏసీబీ దాడులతో ఆందోళనలో ఉద్యోగులు-karimnagar rto office under scrutiny acb raids spark fear among employees ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఆర్టీవో కార్యాలయంలో అవినీతి దందా.. ఏసీబీ దాడులతో ఆందోళనలో ఉద్యోగులు

ఆర్టీవో కార్యాలయంలో అవినీతి దందా.. ఏసీబీ దాడులతో ఆందోళనలో ఉద్యోగులు

HT Telugu Desk HT Telugu
May 31, 2024 11:21 AM IST

ఆర్టీవో కార్యాలయంలో అవినీతి దందాకు చెక్ పెట్టేందుకు ఏసీబీ జరిపిన దాడులతో ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. కొందరు చేస్తున్న దోపిడీ అందరికీ శాపంగా మారింది.

కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం
కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులతో ఆర్టీవో కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఏసీబీ దాడుల తర్వాత కరీంనగర్‌లోని ఆర్టీవో కార్యాలయంలో రద్దీ ఘననీయంగా తగ్గింది. ఏజెంట్ల దుకాణాలు బంద్ కావడంతోనే రద్దీ తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏసీబీ అధికారులు కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో దాడులు నిర్వహించినా అసలు రహాస్యాన్ని పసిగట్టలేకపోయారనే చర్చ జోరుగా సాగుతోంది. అందుకే ఏసీబీ అధికారులు మరోసారి ప్రత్యేక దృష్టి పెట్టి ఆర్టీవో ఆఫీసులో జరుగుతున్న రహస్య దందాతో పాటు అవినీతి జలగల భరతం పట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

కోడ్ తో దోపిడి...

రవాణాశాఖకు, వాహనదారులకు మధ్య నగదు లావాదేవీలు గత కొన్నేళ్లుగా తగ్గిపోయాయి. ఏ పని కావాలన్నా అన్ లైన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు . అర్జీదారులు, నగదు రహిత లావాదేవీలతో ఆఫీసులో పనులు జరుపుతున్నా... కొన్ని ఫైళ్లు మాత్రం అవినీతి జలగలకు ఆదాయమార్గాలవుతున్నాయి.

ఏజెంట్లను ధరఖాస్తుదారులు సంప్రదిస్తే వారు అన్నింటినీ పూర్తి చేసి పైళ్లపై తమ కోడ్ ను ఆఫీసుకు పంపిస్తున్నారు. ఫైళ్లపై కోడ్ లు ఉంటే ఆర్టీవో ఆఫీసులోని కౌంటర్ల వద్ద అర్జీదారుడు ఫోటో దిగడం, డిజిటల్ సంతకం చేయడం చకాచకా సాగిపోతున్నాయి. అర్జీదారుడు నేరుగా వస్తే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడం, ఏ చిన్న పొరపాటున్నా అలాంటి తప్పును ఎత్తి చూపి ఫైల్ అపేయడం చేస్తుంటారు.

ముఖ్యంగా వాహన ఫిట్నెస్‌లు, లర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్సుల ఫైళ్లపైనే కోడ్ లు ఉండడం బహిరంగ రహస్యం. ఏసీబీ అధికారులు దాడులు జరిపినప్పుడు అత్యధికంగా విద్యా సంస్థల బస్సులే ఫిట్నెస్ కు రాగా, వాటిపై కోడ్ కానరాలేదని తెలిసింది. ఎక్కువ బస్సులున్న విద్యా సంస్థల వారు అధికారులను నేరుగా కలుస్తున్నారు. ఏజెంట్ల ద్వారా వెళ్లే విద్యా సంస్థల బస్సులు తక్కువగానే ఉన్నాయని సమాచారం.

అందుకే ఏసీబీ తనిఖీల్లో కోడ్ ఉన్న ఫైళ్లు తక్కువగానే ఉన్నట్లు తెల్సింది. విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ చేయాలంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము కాకుండా అదనంగా ఖర్చులు అవుతున్నాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే గతంలో అదనంగా వెయ్యి రూపాయల ఖర్చు అయితే... ఇప్పుడు రూ. 3200 ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లేదంటే తమ బస్సు ఫిట్నెస్ నిలిచిపోతుందని, అందుకే అడిగినకాడికి ఇవ్వక తప్పడం లేదని వాపోతున్నారు. విద్యా సంస్థల బస్సులైనా, ఇతర వాహనాలైనా ఫిట్నెస్ కోసం వస్తే వారికి అధికారులు చుక్కలు చూపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏజెంట్ల ద్వారా వచ్చిన ఫైళ్లపై కోడ్ ఉన్నా.. చిన్న చిన్న పొరపాట్లను సాకుగా చూపుతూ కొర్రీలు పెడుతూ ఫిట్నెస్ అపుతున్నారని, వాహనదారుడు దానికి వేరే రేటు ఇచ్చుకుంటే ఫిట్నెస్ పూర్తవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇతర రాష్ట్రాల నుండి వాహనాలు కొనుగోలు చేసుకొని వచ్చిన అర్జీదారునికి అసలు కంటె కొసరే ఎక్కువగా భారమవుతుందనే తెలుస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అసలు సొమ్మును చెల్లించినా తనిఖీ అధికారులు కొసరుగా వేరే రేట్లను ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు వినబడుతోంది. గతంలో ఒక్కో వాహనానికి రూ. 2200 లు ఉంటే దానిని ఏకంగా రూ. 5500 కు పెంచినట్లు ఆరోపణలున్నాయి.

అనుకున్నంత ఇచ్చినా... ఇతర రాష్ట్ర వాహన కొనుగోలుదారుడు ఆఫీసుకు వస్తే మరో భారం మోపుతున్నట్లు సమాచారం. ఆఫీసుకు వచ్చిన వాహనంపై కేసు రాసి వాహన చెక్ రిపోర్టును చేతులో పెట్టేసి కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. అసలు, చెల్లించినా సంతృప్తి పడని అవినీతి జలగలు కేసు పేరుతో తమపై మరింత భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ఫైళ్లను పరిశీలిస్తే...

కరీంనగర్ రవాణాశాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన అవినీతి నిరోదక శాఖ అధికారులు గత నెల రోజుల ఫైళ్లను చూసి వాటిపై విచారణ చేపడితే అవినీతి జలగల అక్రమ దందా బహిర్గతం కావడం ఖాయమని చెప్పవచ్చు. ముఖ్యంగా లైసెన్సు పైళ్లు, వాహన ఫిట్నెస్ ఫైళ్లతోపాటు ఇతర రాష్ట్రాల వాహనాల ఫైళ్లను పరిశీలించి సదరు అర్జీదారులను విచారిస్తే రహాస్యాలన్ని బట్టబయలు అయ్యే అవకాశం ఉంది.

అయితే ఆర్టీవో ఆఫీసులో వాహన ఫిట్నెస్ ఫైళ్లు, ఇతర రాష్ట్ర వాహన ఫైళ్ల విషయంలో ఎంతా చెప్పినా ఓ అధికారి వినకుండా మొండిగా దండుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసిస్టెంట్లకు ఎంత చెప్పినా వినడం లేదని, ఇది తమకు ఇబ్బందిగానే ఉందని సీనియర్ అధికారులు సైతం జంకుతున్నారు.

అవినీతి రహస్యం బయటకురావాలంటే వాహన తనిఖీ అధికారులను విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చేస్తే మొండిగా దండుకునే సదరు అధికారి అవినీతి భాగోతం బట్టబయలవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

- కె.వి.రెడ్డి, HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్