Online Puja : ఆన్‌లైన్ పూజలు.. విదేశాల్లో ఉన్న తెలుగు వారి మనసులు గెలుచుకుంటున్న హైటెక్ పూజారి!-a hitech priest is winning the hearts of telugu people abroad with online worship ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Online Puja : ఆన్‌లైన్ పూజలు.. విదేశాల్లో ఉన్న తెలుగు వారి మనసులు గెలుచుకుంటున్న హైటెక్ పూజారి!

Online Puja : ఆన్‌లైన్ పూజలు.. విదేశాల్లో ఉన్న తెలుగు వారి మనసులు గెలుచుకుంటున్న హైటెక్ పూజారి!

HT Telugu Desk HT Telugu
Sep 14, 2024 04:58 PM IST

Online Puja : సాంకేతిక పరిజ్ఞానం.. అసాధ్యన్నీ సుసాధ్యం చేస్తుంది. ఎక్కడో ఉన్న వారితో ఇక్కడే ఉన్నట్టుగా మాట్లాడినట్టే.. ఎక్కడో ఉన్న దేవతలకు ఇక్కడి నుండి పూజలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పూజలు చేస్తూ.. విదేశాల్లో ఉన్న తెలుగువారి మన్ననలు పొందుతున్నాడు మెదక్ జిల్లాకు చెందిన హైటెక్ పూజారి.

ఆన్‌లైన్ పూజలు
ఆన్‌లైన్ పూజలు

హిందువులు అత్యంత ప్రముఖంగా జరుపునే పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ పండగను పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఉద్యోగార్థం విదేశాలకు వెళ్లిన హిందువులు కూడా వినాయక చవితి పండుగ జరుపుకుంటారు. కానీ అక్కడ తెలుగు పూజారులు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో.. మెదక్‌కు ఓ హైటెక్ పూజారి కొత్త పంథాను ఎంచుకున్నారు. ఆన్‌లైన్‌లోనే పూజలు చేస్తూ.. తెలుగువారిని సంతృప్తి పరుస్తున్నారు.

డల్లాస్‌లో ఉన్న వినాయకుడికి ఇక్కడి నుంచే పూజలు..

అమెరికా డల్లాస్ నగరంలోనీ హానీక్రిక్ కాలనీలో తెలంగాణకు చెందిన చాలామంది స్థిరపడ్డారు. ఆ కాలనీలోనే నివాసం ఉంటున్న మరి కొంతమంది భారతీయులతో కలిసి గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రతిష్టించిన వినాయకుడికి పూజలు నిర్వహించడానికి వారు మెదక్ మండలం పేరూరూ సరస్వతి ఆలయ పూజారి దోర్బల మహేష్ శర్మను కోరారు. వారి కోరికను మన్నించిన మహేష్ శర్మ.. వీడియో కాల్ ద్వారా పూజలు నిర్వహించారు.

వేద విద్యను పూర్తీ చేసిన మహేష్ శర్మ...

25 సంవత్సరాల క్రితం సిద్దిపేటలోని కోటిలింగాల దేవాలయంలోని వేద పాఠశాలలో మహేష్ శర్మ యజుర్వేద విద్యను పూర్తి చేశాడు. అనంతరం తండ్రికి పూజలలో సహాయం చేస్తుండేవారు. మెదక్ లోని ప్రఖ్యాతి చెందిన పేరూరు సరస్వతి ఆలయంలో ప్రధాన పూజారిగా ఉన్నారు. మెతుకు సీమలో అందరికి సుపరిచితుడు. వీడియో కాల్స్ అందుబాటులో లేనప్పుడు 2009లో ఆడియో కాల్ ద్వారా అమెరికాలో నివసిస్తున్న ఒక జంటకు నాగ దోష పూజ జరిపించారు. అప్పటి నుండే ఆన్‌లైన్ ద్వారా భక్తులకు తన సేవలు అందించడం ప్రారంభించాడు.

హైటెక్ పంతులుగా పేరు..

మహేష్ శర్మ.. యూఎస్, కెనడా, యూకే తో పాటు వివిధ ప్రదేశాలలో నివసిస్తున్న తెలుగు వారి కోసం పూజలు నిర్వహిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్న ఆయనను.. భక్తులు హైటెక్ పంతులు అని పిలుస్తారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు వివిధ రకాల దోష పూజల కొరకు తనను సంప్రదిస్తారని ఆయన తెలిపారు. మెదక్ మండలం పేరూరులో ఉన్న సరస్వతి ఆలయంలో దోర్బల మహేష్ శర్మ (39) ప్రధాన అర్చకుడిగా ఉంటూ పూజలు నిర్వహిస్తుంటారు. వినాయక ఉత్సవాల సమయంలో చాలా బిజీగా ఉంటారు. అయినా.. విదేశాల్లో ఉన్న భక్తుల కోరిక మేరకు వర్చువల్ గా పూజ చేయడానికి ఒప్పుకుంటున్నారు.

(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)