Lord Ganesha Sculpture : చవితికి ముందు అద్భుతం.. అతి చిన్న గణపయ్య ప్రత్యక్షం
13th Century Lord Ganesh Sculpture : వినాయక చవితి వచ్చేసింది. ఊరూవాడా గణేశుడి నామస్మరణతో మారుమోగిపోతుంది. అయితే ఈ సమయంలో కాకతీయుల కాలం నాటి బొజ్జ గణపయ్య ప్రత్యక్షమయ్యాడు. చవితి ముందు ఈ వార్తతో చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. పురవాస్తు శాఖ పరిశీలనలో ఈ విగ్రహం బయటపడింది.
కాకతీయుల కాలం నాటి వినాయకుడి విగ్రహం బయటుపడింది. అతి చిన్న రాతి విగ్రహం అది. చరిత్రను తెలుసుకునేందుకు పురవాస్తు శాఖ పలు ప్రాంతాలను పరిశీలిస్తూనే ఉంటుంది. అలా నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పరడ గ్రామ శివార్లలో గుట్టమీదకు వెళ్లింది. అక్కడ కొత్త రాతియుగం, ఇనుపయుగపు ఆనవాళ్లు, గుట్ట దిగువన తూర్పు వైపున్న బౌద్ధ స్థూప శిథిలాలను పరిశీలిస్తోంది. అక్కడ అరుదైన విగ్రహం లభించింది. దానిని చూసి పరిశీలిస్తే.. అతిచిన్న బొజ్జ గణపయ్యగా ఉన్నారు. ఈ విషయాన్ని.. పురావస్తు శాఖ విశ్రాంత అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి బయటకు తెలిపారు.
కాకతీయుల కాలం 13వ శతాబ్దానికి చెందిన ఈ రాతి విగ్రహం 4 సెంటీమీటర్ల ఎత్తు, 3 సెంటీమీటర్ల వెడల్పు ఉందని పురవాస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. తలపైన కాకతీయ శైలి జటామకుటం, ఎడమ వైపు తిరిగి ఉన్న తొండం కూడా ఉందన్నారు. చేతుల్లో దంతం, మోదకం, బొజ్జమీదుగా నాగయజ్ఞోపవీతం ఉందని, ఈ వినాయకుడు లలితాసన భంగిమలో కూర్చుని ఉన్నట్టుగా వెల్లడించారు. ఈ విగ్రహం అప్పట్లో ఇళ్లలో పూజలందుకుని ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కాకతీయుల కాలానికి చెందిన బయటపడిన విగ్రహాల్లో అతిచిన్న విగ్రహం ఇది అని పురావస్తు అధికారులు అంటున్నారు. అప్పుడు ఊరు.. కాలగర్భంలో కలిసిపోయాక.. విగ్రహం మట్టిలోనే ఉండిపోయిందని చెబుతున్నారు. కర్నూలు జిల్లా వీరాపురంలో క్రీ.శ.3వ శతాబ్దికి చెందిన ఇదే పరిమాణంలో ఉన్న మట్టి వినాయకుడి విగ్రహం, కీసరగుట్టలో 5వ శతాబ్దానికి చెందిన గణేశుడి రాతి శిల్పం బయటపడ్డాయన్నారు.
మరోవైపు పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో 12 శతాబ్దం నాటి అరుదైన గణపతి విగ్రహం దొరికింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలోని ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయంలో గణేశుడు పోరాట భంగిమలో ఉన్న అరుదైన శిల్పం అది. ఈ పురాతన విగ్రహం అందరి దృష్టి ఆకర్శిస్తోంది. మాచర్ల పట్టణంలో 12 శతాబ్దం నాటి అరుదైన గణేశుడి విగ్రహం లభ్యమైందని.. పురావస్తు శాస్త్రవేత్త, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఇ.శివనాగిరెడ్డి అన్నారు.
ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయంలోని రంగమండప స్తంభం మధ్య భాగంలో గణేశుడి పోరాట విగ్రహం ప్రతిమ ఉందని శివనాగిరెడ్డి అన్నారు. పురాణంలో పేర్కొన్న విధంగా గణేశుడు ఓ రాక్షసుడితో పోరాటం చేస్తున్నట్టు ఉందని చెప్పారు. ప్రజలు వారసత్వ సంపదను కాపాడాలని శివనాగిరెడ్డి కోరారు. ఈ విగ్రహంలో వినాయకుడు ఒక్క చేతిలో గొడ్డలి, మరో చేతితో కొరడ పట్టుకుని ఉన్నాడు. మరో రెండు చేతులతో రాక్షసుడితో పోరాటం చేస్తున్నాడు.