Virat Kohli: విరాట్‌ కోహ్లిని తిట్టారో.. ఫ్యాన్స్‌కు పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌-virat kohli is still a great player says former pakistan captain wasim akram ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli: విరాట్‌ కోహ్లిని తిట్టారో.. ఫ్యాన్స్‌కు పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌

Virat Kohli: విరాట్‌ కోహ్లిని తిట్టారో.. ఫ్యాన్స్‌కు పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌

Hari Prasad S HT Telugu
Aug 24, 2022 05:02 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లిని తిట్టారో జాగ్రత్త అని వార్నింగ్‌ ఇస్తున్నాడు పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌. అతన్ని విమర్శించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని అతడు స్పష్టం చేస్తున్నాడు.

<p>విరాట్ కోహ్లి, వసీం అక్రమ్</p>
విరాట్ కోహ్లి, వసీం అక్రమ్ (Getty Images)

Virat Kohli: విరాట్‌ కోహ్లి ఫామ్‌పై చర్చ నడుస్తూనే ఉంది. ఆసియాకప్‌కు టైమ్‌ దగ్గర పడటంతో ఇప్పుడైనా కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా లేదా అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ మాత్రం విరాట్‌ కచ్చితంగా మళ్లీ గాడిలో పడతాడని అంటున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ కూడా కోహ్లి ఫామ్‌పై స్పందించాడు.

అంతేకాదు విరాట్‌ను విమర్శించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఇండియన్‌ ఫ్యాన్స్‌కు సూచిస్తున్నాడు. అతడు కచ్చితంగా మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని, అయితే అది పాకిస్థాన్‌పై కాకపోతే తాను సంతోషిస్తానని కూడా అనడం విశేషం. "ముందుగా నేను చెప్పదలచుకున్నది ఏంటంటే.. గత ఏడాది కాలంగా సోషల్‌ మీడియాలో ఇండియన్‌ ఫ్యాన్స్‌, ప్రెస్‌ అనవసరంగా విరాట్‌ కోహ్లిని టార్గెట్‌ చేస్తున్నారు. అతని వయసు కేవలం 33 ఏళ్లు. ఆధునిక క్రికెట్‌లోనే కాదు ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ప్లేయర్స్‌లో అతనూ ఒకడు" అని స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ అక్రమ్‌ అన్నాడు.

ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైన విరాట్‌ కోహ్లి.. తర్వాత ఇంగ్లండ్‌ టూర్‌లోనూ గాడిలో పడలేదు. వెస్టిండీస్‌, జింబాబ్వే టూర్ల నుంచి తప్పుకోవడంతో అతనికి నెల రోజుల విశ్రాంతి లభించింది. ఆసియా కప్‌ ప్రారంభానికి చాలా రోజుల ముందు నుంచే అతడు తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఇక ఇప్పుడు ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌పైనే విరాట్‌ కోహ్లి తన 100వ టీ20 మ్యాచ్‌ ఆడబోతుండటం విశేషం.

అతడు తమ టీమ్‌పై మాత్రం ఫామ్‌లోకి రాకూడదని అక్రమ్‌ నవ్వుతూ అన్నాడు. "టీ20లతోపాటు అన్ని ఫార్మాట్లలో విరాట్‌కు 50కి పైగా సగటు ఉంది. ఫిట్‌నెస్‌ అద్భుతంగా ఉంది. ఇండియన్‌ టీమ్‌లోని బెస్ట్‌ ఫీల్డర్స్‌లో ఒకడు. అందుకే ఫామ్ తాత్కాలికమే. క్లాస్‌ శాశ్వతం. అతడు కచ్చితంగా గాడిలో పడతాడు. ఇప్పటికే అతడో గ్రేట్ ప్లేయర్‌. పాకిస్థాన్‌పై ఫామ్‌లోకి రావద్దని కోరుకుంటున్నాను కానీ అతడైతే కచ్చితంగా గాడిలో పడతాడు" అని అక్రమ్‌ స్పష్టం చేశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం