Asia Cup 2022: దుబాయ్ చేరుకున్న పాకిస్థాన్.. టీమిండియా కోసం వెయిటింగ్
Asia Cup 2022: ఆసియాకప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ టీమ్ దుబాయ్ చేరుకుంది. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో ఆదివారం (ఆగస్ట్ 28) టీమిండియాతో పాక్ తొలి మ్యాచ్ ఆడుతుంది.
Asia Cup 2022: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ యూఏఈలో జరగబోయే ఆసియా కప్ కోసం మంగళవారం (ఆగస్ట్ 23) ఉదయం దుబాయ్ చేరుకుంది. మూడు వన్డేల కోసం నెదర్లాండ్స్ వెళ్లిన పాక్ టీమ్.. అక్కడ సిరీస్ క్లీన్‌స్వీప్ చేసి అటు నుంచే దుబాయ్ చేరింది. ఇక ఈ టీమ్‌లో లేని ఇఫ్తికార్ అహ్మద్, ఉస్మాన్ ఖాదిర్, హైదర్ అలీ, ఆసిఫ్ అలీలాంటి వాళ్లు లాహోర్ నుంచి దుబాయ్ వచ్చారు.
నెదర్లాండ్స్ టూర్ కోసం పాక్ టీమ్‌లో ఉన్న అబ్దుల్లా షఫిక్, ఇమాముల్ హక్, మహ్మద్ హరీస్, సల్మాన్ అలీ, జాహిద్ మహమూద్ స్థానాల్లో వీళ్లు టీమ్‌తో చేరారు. నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వాళ్లలో కెప్టెన్ బాబర్ ఆజంతోపాటు మిగతా ప్లేయర్స్ ఉన్నారు. ఇక గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన స్టార్ పేస్‌బౌలర్ షహీన్ అఫ్రిది స్థానంలో ఎంపికైన ముహమ్మద్ హస్నైన్ బ్రిటన్ నుంచి రానున్నాడు.
ఆదివారం (ఆగస్ట్ 28) దాయాది ఇండియాతో తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్ ఇక దుబాయ్‌లో టీమిండియా కోసం వెయిట్ చేయనుంది. ఇండియా, పాకిస్థాన్‌తోపాటు ఓ క్వాలిఫయర్ గ్రూప్ ఎలో ఉన్నారు. ఇక గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఆగస్ట్ 27 నుంచి సెప్టెంబర్ 11 వరకూ ఆసియాకప్ జరగనుంది. ఇప్పటికే క్వాలిఫయర్స్ టోర్నీ ప్రారంభమైంది.
ఈ నెల 27న శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్‌తో ప్రధాన టోర్నీ మొదలవుతుంది. ఇటు ఇండియన్ టీమ్ యూఏఈ బయలుదేరే ముందు షాక్ తగిలిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడ్డాడు. అతడు టీమ్‌తో వెళ్తాడా లేదా అన్నది తెలియడం లేదు. మరోవైపు ఇప్పటికే గాయంతో స్టార్ బౌలర్ బుమ్రా కూడా దూరమయ్యాడు.
ఆసియాకప్‌లో ఆడే పాకిస్థాన్ టీమ్: బాబర్ ఆజం( కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్లికార్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, మహ్మద్ హస్నైన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, మొహ్మద్ వసీం, నసీం షా, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్.