Virat Kohli on Criticism: విమర్శకులకు విరాట్ కోహ్లి అదిరిపోయే కౌంటర్
Virat Kohli on Criticism: విమర్శకులకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు విరాట్ కోహ్లి. ఆసియాకప్‌కు సిద్ధమవుతున్న అతడు.. స్టార్‌స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో మాట్లాడుతూ.. తన బలహీనతను అధిగమించినట్లు చెప్పాడు.
Virat Kohli on Criticism: చాలా రోజులుగా తనపై వస్తున్న విమర్శలకు విరాట్ కోహ్లి అదిరిపోయే సమాధానమిచ్చాడు. అసలు సామర్థ్యం లేకపోయి ఉంటే ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఇంత దూరం వచ్చి ఉండేవాడినేనా అని అడిగాడు. అనుభవాలు తనకు ఎంతో పవిత్రమైనవని, వాటి నుంచి తాను నేర్చుకుంటానని కూడా విరాట్ చెప్పాడు.
ఆసియా కప్‌కు సిద్ధమవుతున్న కోహ్లి స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతడు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంగ్లండ్ టూర్లో తన వైఫల్యాలపై స్పందించాడు. "ఇంగ్లండ్‌లో నేను ఒకే విధంగా ఔటయ్యాను. దీని వల్ల దానిపై దృష్టి సారించి దానిని అధిగమించే ప్రయత్నం చేశాను. ప్రస్తుతం సమస్య ఇక్కడ ఉంది అని వేలెత్తి చూపే పరిస్థితి లేదు. నేను బాగా బ్యాటింగ్ చేస్తున్నాను అన్న విషయం తెలుసు. కొన్నిసార్లు అలా ఆలోచించడం మొదలుపెడితే మళ్లీ రిథమ్‌లోకి వచ్చేస్తాను" అని కోహ్లి అన్నాడు.
"అందువల్ల నా వరకూ అది సమస్య కాదు. కానీ ఇంగ్లండ్‌లో అలా జరగలేదు. నేను మంచిగా బ్యాటింగ్ చేస్తున్నానని అనిపించలేదు. అందుకే నా బలహీనతపై దృష్టిసారించి దానిని అధిగమించాను. ప్రస్తుతం ఆ సమస్య లేదు" అని స్పష్టం చేశాడు. ఇక తనపై వస్తున్న విమర్శలకు కూడా కోహ్లి స్పందించాడు. "ప్రస్తుతం నా ఆట ఎలా ఉందో నాకు తెలుసు. పరిస్థితులను, కండిషన్స్‌ను, వివిధ బౌలింగ్‌లను కౌంటర్ చేసే సామర్థ్యం లేకుండా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇంత దూరం రాలేరు" అని కోహ్లి స్పష్టం చేశాడు.
"అందువల్ల ఈ దశను ప్రాసెస్ చేయడం నాకు సులువే. కానీ దీనిని మరచిపోను. దీని నుంచి నేర్చుకుంటాను. ఒడిదుడుకులు ఎలాగూ ఉంటాయి. ఒకసారి నేను ఈ దశ నుంచి బయటపడితే ఎంత నిలకడగా ఆడగలనో నాకు తెలుసు. నా అనుభవాలు నాకు పవిత్రమైనవి. ఇప్పుడైనా, గతంలో అయినా నా అనుభవాల నుంచి నేను నేర్చుకున్నది ఏదైనా ఉంది అంటే అది నేనెప్పుడూ నన్ను ఎక్కువగా భావించలేదు" అని కోహ్లి అన్నాడు.
ప్రస్తుతం ఆసియా కప్ కోసం కోహ్లి సిద్ధమవుతున్నాడు. ఈ నెల 27 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా.. 28న పాకిస్థాన్‌తో ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇది విరాట్ కోహ్లికి కెరీర్‌లో 100వ టీ20 మ్యాచ్ కానుంది. విరాట్ తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఇంతకు మించిన మ్యాచ్ మరొకటి ఉండదు. మరి దీనికోసం అతడు ఎలా సిద్ధమయ్యాడో చూడాలి.
సంబంధిత కథనం