Usman Khawaja: 21వ శతాబ్దంలో ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఖవాజా-usman khawaja is the only second australian in 21st century to score 150 plus score in india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Usman Khawaja: 21వ శతాబ్దంలో ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఖవాజా

Usman Khawaja: 21వ శతాబ్దంలో ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఖవాజా

Hari Prasad S HT Telugu
Mar 10, 2023 12:33 PM IST

Usman Khawaja: 21వ శతాబ్దంలో ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియన్ క్రికెటర్ గా నిలిచాడు ఉస్మాన్ ఖవాజా. అహ్మదాబాద్ టెస్టులో ఇండియన్ టీమ్ కు చుక్కలు చూపిస్తున్న ఖవాజా.. ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా
ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (AP)

Usman Khawaja: ఆస్ట్రేలియా టీమ్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు సెంచరీ చేయగా.. రెండో రోజు తొలి సెషన్ లోనే 150 మార్క్ దాటాడు. ఈ క్రమంలో అతడో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ సిరీస్ లో తొలి మూడు టెస్టులూ స్పిన్నర్లకు అనుకూలించగా.. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న అహ్మదాబాద్ పిచ్ పై ఖవాజా చెలరేగాడు.

ఇండియాపై తొలి సెంచరీ సాధించాడు. రెండో రోజు దానిని 150 మార్క్ దాటించాడు. 21వ శతాబ్దంలో ఇండియాలో ఓ టెస్ట్ ఇన్నింగ్స్ లో 150కిపైగా స్కోరు సాధించిన రెండో ఆస్ట్రేలియన్ ఖవాజా. 2001లో మాథ్యూ హేడెన్ చెన్నైలో జరిగిన టెస్టులో 203 రన్స్ చేశాడు. ఇక ఓవరాల్ గా కూడా టెస్టుల్లో భారత గడ్డపై ఈ రికార్డు అందుకున్న నాలుగో ఆస్ట్రేలియన్ అతడు.

1956లో తొలిసారి జిమ్ బుర్క్ బ్రబౌర్న్ లో జరిగిన టెస్టులో 161 రన్స్ చేశాడు. ఆ తర్వాత 1979లో గ్రాహమ్ యాలప్ ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టెస్టులో 167 రన్స్ చేశాడు. 2001లో హేడెన్ 203 రన్స్ చేయగా.. ఇప్పుడు ఉస్మాన్ ఖవాజా 150 ప్లస్ స్కోరు చేశాడు. ఇక 2019 అక్టోబర్ తర్వాత ఇండియాలో 150 ప్లస్ స్కోరు చేసిన తొలి విదేశీ బ్యాటర్ ఖవాజా. 2019లో సౌతాఫ్రికాకు చెందిన డీన్ ఎల్గార్ 150 ప్లస్ స్కోరు చేశాడు.

2001లో హేడెన్ తర్వాత కేవలం ఐదుగురు విదేశీ బ్యాటర్లు మాత్రమే టెస్ట్ ఇన్నింగ్స్ లో 150కిపైగా రన్స్ చేయగలిగారు. 2004లో సౌతాఫ్రికాకు చెందిన ఆండ్రూ హాల్ (163), 2008లో సౌతాఫ్రికాకే చెందిన నీల్ మెకంజీ (155), 2010లో న్యూజిలాండ్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ (225), 2012లో అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ (176), 2019లో సౌతాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గార్ (160) ఈ ఘనత సాధించారు.

ఇక తాజా సిరీస్ లో తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఖవాజా.. మూడో టెస్టులో కీలకమైన హాఫ్ సెంచరీతో గాడిలో పడ్డాడు. నాలుగో టెస్టులో దానిని ఏకంగా 150 ప్లస్ స్కోరుగా మలిచాడు. గత రెండు టూర్లలో కేవలం డ్రింక్స్ మోయడానికే పరిమితమైన తాను ఇప్పుడు సెంచరీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తొలి రోజు ఆట తర్వాత ఖవాజా అన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం