Asia Cup 2022: ఈ పాకిస్థానీలు విరాట్‌ కోహ్లికి వీరాభిమానులు.. ఏం చేశారో చూడండి.. వీడియో-two pakistani fans waited for hours to take a selfie with virat kohli in dubai ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asia Cup 2022: ఈ పాకిస్థానీలు విరాట్‌ కోహ్లికి వీరాభిమానులు.. ఏం చేశారో చూడండి.. వీడియో

Asia Cup 2022: ఈ పాకిస్థానీలు విరాట్‌ కోహ్లికి వీరాభిమానులు.. ఏం చేశారో చూడండి.. వీడియో

Hari Prasad S HT Telugu
Aug 26, 2022 12:19 PM IST

Asia Cup 2022: ఇద్దరు పాకిస్థానీలు విరాట్‌ కోహ్లి విరాభిమానులు. ఆసియా కప్‌ కోసం దుబాయ్‌ వచ్చిన కోహ్లిని కలవడానికి, అతనితో సెల్ఫీ దిగడానికి వీళ్లు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

విరాట్ కోహ్లి, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం
విరాట్ కోహ్లి, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (AFP)

Asia Cup 2022: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లి ఇప్పుడు ఫామ్‌ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్నాడు కానీ.. అతడు పీక్‌ ఫామ్‌లో ఉన్నప్పుడు ఎలా ఆడేవాడో అందరికీ తెలుసు. దేశంతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలలా విరాట్‌ కోహ్లి అభిమానులు ఉన్నారు. అందులో మన దాయాది పాకిస్థాన్‌ నుంచి కూడా ఉన్నారు. అలా ఇలా కాదు పాక్‌లోనూ కోహ్లి వీరాభిమానులు ఉన్నారు.

తమ దేశ క్రికెటర్ల కంటే విరాట్‌ను ఎక్కువగా ఆరాధించే ఫ్యాన్స్‌ వీళ్లు. అతనితో ఒక్క సెల్ఫీ దిగినా తమ జన్మ ధన్యమవుతుందనుకునే వాళ్లు. తమ పాకిస్థాన్‌ టీమ్‌పై కూడా విరాట్‌ సెంచరీలు, హాఫ్‌ సెంచరీలు చేయాలని కోరుకునే వాళ్లు. అలాంటి ఇద్దరు ఫ్యాన్స్‌ దుబాయ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లిని కలవడానికి ఎంతో ఆరాటపడ్డారు. వీళ్లలో ఒక మహిళా అభిమాని దివ్యాంగురాలు కావడం గమనార్హం.

విరాట్‌ పెద్ద మనసు

కోహ్లి గొప్ప క్రికెటరే కాదు.. అంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి కూడా. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన నూర్‌ అనే ఓ మహిళా అభిమాని నడవలేదు, సరిగా మాట్లాడలేదు. కానీ ఆమె కోహ్లికి పెద్ద అభిమాని. గురువారం ఇండియా ప్రాక్టీస్‌ చేస్తున్న స్టేడియం దగ్గరికి ఆమె వచ్చింది. తన తల్లి, సోదరి ఆమెను అక్కడికి తీసుకొచ్చారు. కోహ్లిని కలవడానికి ఆమె స్టేడియం బయట 3 గంటల పాటు వెయిట్ చేసింది.

ఆమె తన కోసం వేచి చూస్తోందని తెలుసుకున్న విరాట్.. నూర్‌ దగ్గరికి వచ్చి మరీ సెల్ఫీ దిగాడు. ఈ వీడియోను పాక్‌టీవీ.టీవీ యూట్యూబ్‌లో షేర్‌ చేసింది. తాను ఎలా ఉన్నాడో అడిగి, ఎంతో ఆప్యాయంగా విరాట్‌ తనతో మాట్లాడాడని నూర్‌ పొంగిపోయింది. పాకిస్థాన్‌ ప్లేయర్స్‌ను కలిసినా.. ఆమె కోహ్లిని కలవడం కోసమే అంతసేపు వేచి చూసింది. కోహ్లికి చాలా ఆటిట్యూడ్‌ అని అంటారు కానీ.. అతడు చాలా మంచి వ్యక్తి అని నూర్‌ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు.

మరో పాకిస్థానీ కథ వేరు

ఇక విరాట్‌ కోహ్లిని కలవడం కోసం మాత్రమే పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సొంతూరు లాహోర్‌ నుంచి దుబాయ్‌ వచ్చాడు మరో పాకిస్థాన్‌ అభిమాని. ఇతని పేరు మహ్మద్ జిబ్రాన్‌. ప్రపంచంలో తాను కేవలం విరాట్‌ కోహ్లికి మాత్రమే అభిమానిని అని జిబ్రాన్‌ చెప్పడం విశేషం. అంతేకాదు అతడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ చేయాలని ఇతడు కోరుకుంటున్నాడు. కోహ్లి ప్రాక్టీస్‌ ముగించుకొని వెళ్తుంటే సెల్ఫీ కోసం వెంటపడ్డాడు.

కానీ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. విరాట్‌ అతన్ని చూస్తూ లోనికి వెళ్లిపోయాడు. అయితే మీ గురించే నేను పాకిస్థాన్‌ నుంచి వచ్చానని అతడు చెప్పడం విన్నాడు. దీంతో ఆ తర్వాత మళ్లీ బయటకు వచ్చి కోహ్లితో ఫొటో దిగాలన్న తన కోరికను నెరవేర్చుకున్నాడు. కోహ్లితో ఫొటో దిగడానికే పాకిస్థాన్‌ నుంచి వచ్చానని, దీని కోసం నెల రోజుల పాటు వేచి చూశానని జిబ్రాన్‌ చెప్పాడు. ఈ వీడియోను కూడా పాక్‌టీవీ.టీవీ షేర్‌ చేసింది.

WhatsApp channel

సంబంధిత కథనం