Asia Cup 2022: ఆసియాకప్‌లో ఇండియా రికార్డులు ఇవీ.. అత్యధిక రన్స్ చేసిందెవరో తెలుసా?
Asia Cup 2022: ఆసియాకప్ 2022 ఆగస్ట్ 27 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకూ జరిగిన టోర్నీల్లో ఇండియా సగం గెలిచి ఆధిపత్యం చెలాయించింది. ఈ మెగా టోర్నీలో ఇండియా రికార్డులు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
న్యూఢిల్లీ: ఆసియాకప్ 2022లో ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఇంతకుముందు 2016, 2018లలో జరిగిన రెండు టోర్నీల్లోనూ ఇండియానే విజేతగా నిలిచింది. ఈసారి టైటిల్ డిఫెన్స్‌ను ఆగస్ట్ 28న పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌తో మొదలుపెట్టనుంది. ఈసారి ఆసియాకప్ మళ్లీ టీ20 ఫార్మాట్‌లో జరగబోతోంది. 2016లో తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్‌లో ఇండియా ఆడిన ఐదు మ్యాచ్‌లూ గెలిచింది.
చివరిసారి 2018లో మాత్రం ఈ టోర్నీ వన్డే ఫార్మాట్‌లోనే జరిగింది. అప్పుడూ ఇండియానే విజేతగా నిలిచింది. ఇప్పటి వరకూ మొత్తం 14సార్లు ఆసియాకప్ జరగగా.. అందులో ఏడుసార్లు ఇండియానే గెలిచిందన్న విషయం తెలిసిందే. అంతేకాదు మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఆ లెక్కన ఈ టోర్నీలో మనోళ్ల డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండియా తర్వాత శ్రీలంక ఐదు టైటిల్స్‌తో రెండోస్థానంలో ఉంది.
ఆసియా కప్‌లో ఇండియా రికార్డులు ఇవీ
ఆసియాకప్‌లో అత్యధిక విజయాల శాతం ఇండియా సొంతం. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక ఉంది. ఇండియా ఆసియాకప్‌లో ఇప్పటి వరకూ మొత్తంగా 54 మ్యాచ్‌లు ఆడి 36 గెలిచింది. మరో 16 ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.
ఆ లెక్కన ఇండియా విజయాల శాతం 66.66గా ఉంది. ఇక రెండోస్థానంలో ఉన్న శ్రీలంక కూడా 54 మ్యాచ్‌లు ఆడి 35 గెలిచింది. మరో 19 ఓడిపోయింది. ఆ టీమ్ విజయాల శాతం 64.81. ఇక పాకిస్థాన్ 49 మ్యాచ్‌లలో 28 గెలిచి, 20 ఓడిపోయింది. 57.14 విజయాల శాతంతో మూడోస్థానంలో ఉంది.
ఇక ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌పై ఇండియాకు తిరుగులేని రికార్డు ఉంది. ఆ టీమ్‌తో ఇప్పటి వరకూ 14 మ్యాచ్‌లు ఆడి 13 గెలవగా.. కేవలం ఒకే మ్యాచ్‌లో ఓడింది. ఇక శ్రీలంకపై 20 మ్యాచ్‌లు ఆడి 10 గెలిచి, మరో పది ఓడిపోయింది. ఆసియాకప్‌పై ఆధిపత్యం చెలాయించిన ఈ రెండు టీమ్స్ ఒకదానితో మరొకటి తలపడినప్పుడు కూడా అదే రికార్డును మెయింటేన్ చేయడం విశేషం.
పాకిస్థాన్‌పై ఆసియాకప్‌లో ఇండియాకు మెరుగైన రికార్డే ఉంది. మొత్తంగా ఆ టీమ్‌తో ఇప్పటి వరకూ 14 మ్యాచ్‌లు ఆడి 8 గెలవగా, 5 ఓడిపోయింది. అంటే విజయాల శాతం 57.14. చివరిసారి 2018లో పాక్‌తో ఆడినప్పుడు కూడా 9 వికెట్లతో ఇండియానే గెలిచింది.
ఆసియాకప్‌లో అత్యధిక రన్స్, వికెట్లు వీళ్లవే
ఆసియాకప్‌లో ఇండియా తరఫున అత్యధిక రన్స్ చేసింది సచిన్ టెండూల్కర్. అతడు 21ఇన్నింగ్స్‌లో 971 రన్స్ చేశాడు. అతని తర్వాత ప్రస్తుత టీమ్‌లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉన్నారు. రోహిత్ 26 ఇన్నింగ్స్‌లో 883 రన్స్, కోహ్లి 14 ఇన్నింగ్స్‌లో 766 రన్స్ చేశారు. వీళ్లలో కోహ్లి సగటే (63.83) అత్యుత్తమం.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా 18 ఇన్నింగ్స్‌లో 22 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ 12 ఇన్నింగ్స్‌లో 22 వికెట్లు, అశ్విన్ 11 ఇన్నింగ్స్‌లో 18 వికెట్లు, సచిన్ 15 ఇన్నింగ్స్‌లో 17 వికెట్లు, కపిల్ దేవ్ 7 ఇన్నింగ్స్‌లో 15 వికెట్లు తీసుకున్నారు.
సంబంధిత కథనం