Virat Kohli Training: ఆసియాకప్‌ కోసం జిమ్‌లో చెమటోడుస్తున్న విరాట్ కోహ్లి.. వీడియో-virat kohli training hard in gym for asia cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Training: ఆసియాకప్‌ కోసం జిమ్‌లో చెమటోడుస్తున్న విరాట్ కోహ్లి.. వీడియో

Virat Kohli Training: ఆసియాకప్‌ కోసం జిమ్‌లో చెమటోడుస్తున్న విరాట్ కోహ్లి.. వీడియో

Hari Prasad S HT Telugu
Aug 17, 2022 04:17 PM IST

Virat Kohli Training: ఆసియాకప్‌తో తిరిగి టీమిండియాలోకి రానున్న మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అదే సమయంలో తిరిగి ఫామ్‌లోకి రావాలనీ ఉబలాటపడుతున్నాడు. దీనికోసం ముందు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి జిమ్‌లో చెమటోడుస్తున్నాడు.

ఇంగ్లండ్ టూర్ తర్వాత ఆసియాకప్ లో పాకిస‌్థాన్ పైనే తన తొలి మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లి
ఇంగ్లండ్ టూర్ తర్వాత ఆసియాకప్ లో పాకిస‌్థాన్ పైనే తన తొలి మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లి (AFP)

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన కెరీర్‌లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న అతడు.. ఇంగ్లండ్‌ టూర్‌ తర్వాత కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకొని తిరిగి ఆసియాకప్‌ టీమ్‌లోకి వచ్చాడు. త్వరలోనే టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న నేపథ్యంలో ఆసియాకప్‌ విరాట్‌ కోహ్లికి అగ్నిపరీక్ష కానుంది.

ఐపీఎల్‌ తర్వాత కేవలం ఇంగ్లండ్‌లో మాత్రమే ఆడాడు. అక్కడ కూడా దారుణంగా విఫలమయ్యాడు. వెస్టిండీస్‌, జింబాబ్వే టూర్‌లకు దూరంగా ఉన్నాడు. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కూడా లేని విరాట్‌ నేరుగా ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరగనున్న హైవోల్టేజ్‌ మ్యాచ్‌లో ఎలా ఆడతాడన్నది ఆసక్తిగా మారింది. అయితే దీనికోసం కోహ్లి కఠినంగానే శ్రమిస్తున్నాడు.

తాజాగా బుధవారం (ఆగస్ట్‌ 17) అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. అందులో అతడు జిమ్‌లో బరువులు ఎత్తుతూ, కఠినమైన కసరత్తులు చేస్తూ కనిపించాడు. ఈ వీడియో అతడు పోస్ట్‌ గంటలోనే లక్షల కొద్దీ లైక్స్‌, కామెంట్స్ రావడం విశేషం. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న ప్లేయర్స్‌లో అత్యంత ఫిట్‌గా ఉండే విరాట్‌.. బ్యాట్‌తో ఫామ్‌లోకి వచ్చే ముందు తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాడు. వారం రోజులుగా ఆసియాకప్‌ కోసం అతడు సిద్ధమవుతున్నాడు.

ఈ నెల 27 నుంచి ఆసియాకప్‌ ప్రారంభం కానుండగా.. 28న పాకిస్థాన్‌తో ఇండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియాను ఓడించిన పాకిస్థాన్‌ ఈ మ్యాచ్‌కు కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగనుంది. అయితే టోర్నీ ఫేవరెట్‌గా టీమిండియా దిగుతున్నా.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఒత్తిడిని ఎంత వరకూ జయిస్తుందో చూడాలి. ఇందులో విరాట్‌ కోహ్లిలాంటి సీనియర్ ప్లేయర్‌ పాత్రే కీలకం కానుంది.

తాను తిరిగి ఫామ్‌లోకి రావడానికి కూడా విరాట్‌కు ఇంతకు మించిన వేదిక మరొకటి ఉండదు. 2019లో చివరిసారి సెంచరీ చేసిన కోహ్లి మూడేళ్లుగా మూడంకెల స్కోరు కోసం చూస్తుండగా.. ఈ ఏడాది మొత్తంగా ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వెస్టిండీస్‌, జింబాబ్వేలాంటి టూర్లకు వెళ్లి ఉంటే కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వచ్చే వీలుండేదని కొందరు మాజీలు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నేరుగా పాకిస్థాన్‌తోనే అతడు తన తర్వాతి మ్యాచ్‌ ఆడనుండటంతో విరాట్‌పై ఒత్తిడి మరింత ఎక్కువగా ఉండనుంది.

WhatsApp channel