Mithali Raj: ఐపీఎల్‌లో ఛాన్స్‌ వస్తే రిటైర్మెంట్‌ పక్కనపెట్టి మళ్లీ వస్తా: మిథాలీరాజ్‌-might come out of retirement if i get a chance in womens ipl says mithali raj ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mithali Raj: ఐపీఎల్‌లో ఛాన్స్‌ వస్తే రిటైర్మెంట్‌ పక్కనపెట్టి మళ్లీ వస్తా: మిథాలీరాజ్‌

Mithali Raj: ఐపీఎల్‌లో ఛాన్స్‌ వస్తే రిటైర్మెంట్‌ పక్కనపెట్టి మళ్లీ వస్తా: మిథాలీరాజ్‌

Hari Prasad S HT Telugu
Jul 25, 2022 04:20 PM IST

Mithali Raj: ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తన రిటైర్మెంట్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఐపీఎల్‌లో ఛాన్స్‌ వస్తే మళ్లీ వస్తా అని ఆమె అనడం విశేషం.

మిథాలీ రాజ్
మిథాలీ రాజ్ (AFP)

న్యూఢిల్లీ: ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 23 ఏళ్ల పాటు ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ను ఏలింది మిథాలీ రాజ్‌. ఈ మధ్యే ఇక చాలనుకొని క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించేసింది. అయితే తాజాగా ఐసీసీ పాడ్‌కాస్ట్‌ 100% క్రికెట్‌లో మాట్లాడుతూ ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. వచ్చే ఏడాది తొలి మహిళల ఐపీఎల్‌ జరగనున్న విషయం తెలిసిందే.

ఇందులో ఛాన్స్‌ వస్తే తన రిటైర్మెంట్‌ నుంచి బయటకు రావడంపై ఆలోచిస్తానని మిథాలీ చెప్పింది. ఈ పాడ్‌కాస్ట్‌లో ఇంగ్లండ్ స్టార్‌ ఇసా గుహ, న్యూజిలాండ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ఫ్రాంకీ మెక్‌కేతో కలిసి ఆమె మాట్లాడింది. వుమెన్స్‌ ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే రిటైర్మెంట్‌ నుంచి బయటకు వస్తారా అని ప్రశ్నించగా.. "ఆ ఆప్షన్‌ ఉంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వుమెన్స్‌ ఐపీఎల్‌కు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. వుమెన్స్‌ ఐపీఎల్‌ తొలి ఎడిషన్‌లో పాల్గొనడం చాలా బాగుంటుంది" అని మిథాలీ రాజ్‌ చెప్పింది.

ఇక ఇప్పుడున్న టీమ్‌లోని యంగ్‌స్టర్స్‌ గురించి మాట్లడుతూ.. షెఫాలీ వర్మకు తాను పెద్ద అభిమానిని అని మిథాలీ చెప్పడం విశేషం. ఒంటిచేత్తో టీమ్‌ను గెలిపించే సత్తా షెఫాలీకి ఉందని మిథాలీ అభిప్రాయపడింది. తొలిసారి ఓ డొమెస్టిక్‌ మ్యాచ్‌లో ఆమె ఆడుతున్నప్పుడు చూశానని, ఆమె ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ మొత్తం మారిపోయిందని మిథాలీ చెప్పింది.

రిటైర్మెంట్‌ తర్వాత తన లైఫ్‌స్టైల్‌ కాస్త నెమ్మదిస్తుందని భావించానని, అయితే ప్రస్తుతానికైతే అలాంటిదేమీ లేకుండా బిజీగానే గడుపుతున్నట్లు చెప్పింది. ఇదంతా ముగిసిన తర్వాత తనకు రిటైర్మెంట్‌ తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుందేమో అని మిథాలీ అన్నది. 23 ఏళ్లలో 232 వన్డేలు ఆడిన మిథాలీ 7805 రన్స్‌, 89 టీ20ల్లో 2364 రన్స్‌, 12 టెస్టుల్లో 699 రన్స్‌ చేసింది.

WhatsApp channel

టాపిక్