వరల్డ్‌కప్‌ ఇక ద్రవిడ్‌, రోహిత్‌ చేతుల్లోనే..: సచిన్‌ టెండూల్కర్‌-rohit and dravid are great pair says sachin tendulkar ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  వరల్డ్‌కప్‌ ఇక ద్రవిడ్‌, రోహిత్‌ చేతుల్లోనే..: సచిన్‌ టెండూల్కర్‌

వరల్డ్‌కప్‌ ఇక ద్రవిడ్‌, రోహిత్‌ చేతుల్లోనే..: సచిన్‌ టెండూల్కర్‌

Hari Prasad S HT Telugu
Jan 27, 2022 08:02 PM IST

ఇండియా చివరిసారి ఓ ఐసీసీ ట్రోఫీ గెలిచింది 2013లో. ధోనీ కెప్టెన్సీలో అప్పుడు ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. అప్పటి నుంచి 9 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టోర్నీ గెలవలేకపోయింది. ఇక వరల్డ్‌కప్‌ గెలిచి ఈ ఏప్రిల్‌ నాటికి 11 ఏళ్లవుతుంది.

చిన్నారులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న సచిన్ (ఫైల్ ఫొటో)
చిన్నారులకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న సచిన్ (ఫైల్ ఫొటో) (ANI)

ముంబై: ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్‌నే ఇప్పటికీ అభిమానులు తలచుకుంటున్నారు. మరో వరల్డ్‌కప్ ఎప్పుడు తెస్తారా అని ఎదురుచూస్తున్నారు. సాధారణ క్రికెట్‌ అభిమానులకే కాదు.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఓ మెగా ట్రోఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ బోరియా మజుందార్‌ యూట్యూబ్‌ షో బ్యాక్‌స్టేజ్‌ విత్‌ బోరియాలో సచినే చెప్పాడు. 

"ఈ ఏప్రిల్‌ వస్తే వరల్డ్‌కప్‌ విజయానికి 11 ఏళ్లు పూర్తవుతాయి. ఇది చాలా సుదీర్ఘ నిరీక్షణ. బీసీసీఐ కేబినెట్‌లో మరో ట్రోఫీ కోసం నాతోపాటు అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ ట్రోఫీ కోసం అందరు క్రికెటర్లు ఆడతారు. ఏ ఫార్మాట్‌ అయినా ఇంతకుమించిన టోర్నీ ఇంకొకటి ఉండదు. వరల్డ్‌కప్‌ ఎప్పటికీ ప్రత్యేకమే" అని సచిన్‌ అన్నాడు. ఈ మధ్య కాలంలో ఇండియన్‌ క్రికెట్‌లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 

అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్నాడు. ఇప్పుడిక అందరి కళ్లూ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కొత్త కెప్టెన్‌ రోహిత్‌ శర్మపైనే ఉన్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌పై సచిన్‌ కూడా ఎంతో విశ్వాసం వ్యక్తం చేశాడు. "రోహిత్‌, రాహుల్‌ అద్భుతమైన జోడీ. ఈ ఇద్దరూ తమ సామర్థ్యం మేరకు ఈ ట్రోఫీ కోసం సిద్ధమవుతారని నాకు తెలుసు. మీకు ఎంతో మంది మద్దతు ఉంది. సరైన సమయంలో ఇలాంటి మద్దతే కావాలి. అందరూ చాలా క్రికెటే ఆడారు. ఈ గేమ్‌లో ఎత్తుపల్లాలను అర్థం చేసుకునేంత క్రికెట్‌ను రాహుల్‌ ద్రవిడ్‌ ఆడాడు. నమ్మకం కోల్పోకపోవడమే కావాల్సింది. ప్రయత్నిస్తూనే ముందుకు సాగండి" అని సచిన్‌ టీమిండియాకు పిలుపునిచ్చాడు. 

పూర్తిస్థాయి కోచ్‌గా ద్రవిడ్‌కు తొలి విదేశీ పర్యటనే చేదు అనుభవాన్నిచ్చింది. సౌతాఫ్రికాలో టెస్ట్‌, వన్డే సిరీస్‌లను టీమిండియా ఓడిపోయింది. ఇక ఇప్పుడు సొంతగడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. వచ్చే నెలలో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ కోసం విండీస్‌ టీమ్‌ వస్తోంది. రోహిత్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో ఈ సిరీస్‌కు తిరిగి వస్తున్నాడు. ద్రవిడ్‌తో అతని కాంబినేషన్‌ ఎలా ఉండబోతోందో అభిమానులు చూడబోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనున్న విషయం తెలిసిందే.

WhatsApp channel

సంబంధిత కథనం