Sourav Ganguly on Virat Kohli: విరాట్ టెస్టుల్లో మెరుగవ్వాలి.. ఎందుకంటే..:గంగూలీ
Sourav Ganguly on Virat Kohli: విరాట్ కోహ్లి టెస్టుల్లో మెరుగవ్వాలని అన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఈ ఫార్మాట్ లో టీమిండియా అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుందని చెప్పాడు.
Sourav Ganguly on Virat Kohli: విరాట్ కోహ్లి గతేడాది మొదట్లో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. పూర్తిగా ఫామ్ కోల్పోయి చివరికి జట్టులో స్థానం అవసరమా అని పలువురు ప్రశ్నించే దుస్థితికి చేరాడు. దీంతో అతడు కొంతకాలం క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. వెస్టిండీస్, జింబాబ్వేలాంటి టూర్లకు దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. ఓ మాట అన్నాడు.
ఆసియా కప్ కు తిరిగి వస్తున్న విరాట్.. తనకోసం తాను పరుగులు చేయాలని, అతనికి ఇది మంచి సీజన్ గా నిలవాలని ఆకాంక్షించాడు. దాదా చెప్పినట్లే ఆసియా కప్ నుంచి విరాట్ కెరీర్ మరోసారి మలుపు తిరిగింది. మునుపటి కోహ్లిని గుర్తు చేస్తూ ఆ తర్వాత సెంచరీల మీద సెంచరీలు బాదుతూ వచ్చాడు. కొత్త ఏడాదినీ అలాగే మొదలుపెట్టాడు. ఇప్పుడిక విరాట్ టెస్టుల్లోనూ మెరుగు పడాలని అంటున్నాడు గంగూలీ.
ముఖ్యంగా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో విరాట్ ఈ ఫార్మాట్ లో టాప్ ఫామ్ లో ఉండటం ఇండియాకు చాలా అవసరమని దాదా అభిప్రాయపడ్డాడు. గత ఆరు నెలల్లో కోహ్లి కేవలం రెండే టెస్టులు ఆడాడు. ఈ నేపథ్యంలో ఈ నాలుగు టెస్టుల సిరీస్ లో అతడు ఎలా ఆడతాడన్నది ఆసక్తిగా మారింది. దీనిపైనే స్పోర్ట్స్ తక్ తో మాట్లాడుతూ దాదా స్పందించాడు.
"కచ్చితంగా అతడు టాప్ ఫామ్ లో ఉన్నాడు. శ్రీలంకపై, బంగ్లాదేశ్ పై అద్భుతంగా ఆడాడు. అయితే టెస్టు క్రికెట్ లో అతడు మెరుగు పడాలి. ఎందుకంటే ఆస్ట్రేలియాతో ఎంతో ముఖ్యమైన సిరీస్ రానున్న నేపథ్యంలో ఇండియన్ టీమ్ అతనిపై ఎక్కువగా ఆధారపడింది. ఈ సిరీస్ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్నాను. విపరీతమైన పోటీ ఉంటుంది. రెండూ మంచి టీమ్స్. ఈ రెండు టీమ్సే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో కూడా తలపడే అవకాశాలు ఉన్నాయి." అని గంగూలీ అన్నాడు.
చివరిసారి ఆస్ట్రేలియా పర్యటనకు ఇండియా వెళ్లినప్పుడు కోహ్లినే కెప్టెన్ గా ఉన్నాడు. అయితే అడిలైడ్ లో తొలి టెస్ట్ తర్వాత తనకు కూతురు పుట్టడంతో తిరిగి ఇండియాకు వచ్చేశాడు. తొలి టెస్ట్ దారుణంగా ఓడిన తర్వాత తిరిగి అద్భుతంగా పుంజుకున్న టీమిండియా.. ఆ సిరీస్ గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియాకు తీసుకొచ్చింది. ఇప్పుడా ట్రోఫీని తిరిగి తీసుకెళ్లాలన్న పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది.
ఫిబ్రవరి 9 నుంచి ఈ నాలుగు టెస్టులు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ను ఇండియా 2-0తో గెలిస్తే టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ సొంతమవుతుంది. ఇక ఫైనల్ చేరాలంటే మాత్రం ఒక్క టెస్ట్ కంటే ఎక్కువ ఓడిపోకూడదు. ఈ సిరీస్ ను 4-0, 3-0 లేదంటే 3-1తో గెలిచినా ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుతుంది.
సంబంధిత కథనం