Women's IPL Teams: రూ.4669 కోట్లు.. మహిళల ఐపీఎల్ టీమ్స్ వేలం ద్వారా బీసీసీఐపై కాసుల వర్షం-womens ipl teams announced as the bcci gets richer by another 4669 crores ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Womens Ipl Teams Announced As The Bcci Gets Richer By Another 4669 Crores

Women's IPL Teams: రూ.4669 కోట్లు.. మహిళల ఐపీఎల్ టీమ్స్ వేలం ద్వారా బీసీసీఐపై కాసుల వర్షం

Hari Prasad S HT Telugu
Jan 25, 2023 04:05 PM IST

Women's IPL Teams: రూ.4669 కోట్లు బీసీసీఐపై వచ్చి పడ్డాయి. మహిళల ఐపీఎల్ టీమ్స్ వేలం ద్వారా బోర్డు ఈ భారీ మొత్తం ఆర్జించింది. మొత్తం ఐదు టీమ్స్ కోసం విజయవంతమైన బిడ్డర్ల పేర్లను బుధవారం (జనవరి 25) అనౌన్స్ చేసింది.

మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఫుల్ డిమాండ్
మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఫుల్ డిమాండ్ (IPL)

Women's IPL Teams: ఇండియాలో మహిళల క్రికెట్ మరో రేంజ్ కు వెళ్లింది. తొలిసారి నిర్వహించనున్న మహిళల ఐపీఎల్ టీమ్స్ కోసం బిడ్లను ఆహ్వానించగా.. బీసీసీఐపై కాసుల వర్షం కురిపించింది. ఐదు ఫ్రాంఛైజీల కోసం సక్సెస్ ఫుల్ బిడ్లను దాఖలు చేసిన కంపెనీల పేర్లను బోర్డు బుధవారం (జనవరి 25) వెల్లడించింది. ఇందులో అదానీ స్పోర్ట్స్ లైన్, రాయల్ ఛాలెంజర్స్, జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ లిమిటెడ్, క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్, ఇండియావిన్ స్పోర్ట్స్ లిమిటెడ్ ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఐదు ఫ్రాంఛైజీల వేలం ద్వారా బీసీసీఐకి ఏకంగా రూ.4669.99 కోట్లు రావడం విశేషం. తొలి మహిళల ఐపీఎల్లో అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో నగరాల జట్లు పోటీ పడనున్నాయి. వీటిలో అత్యధికంగా అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని ఏకంగా రూ.1289 కోట్లతో అదానీ గ్రూప్ కు చెందిన అదానీ స్పోర్ట్స్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకోవడం గమనార్హం.

ఇక రిలయెన్స్ గ్రూపులో భాగమైన ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముంబై ఫ్రాంఛైజీని రూ.912.99 కోట్లకు దక్కించుకుంది. మెన్స్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీమ్ కూడా రిలయెన్స్ చేతుల్లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే మెన్స్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ను కలిగి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ గ్రూపు మహిళల ఐపీఎల్లోనూ బెంగళూరు జట్టును దక్కించుకుంది.

దీనికోసం ఆ గ్రూపు రూ.901 కోట్ల బిడ్ దాఖలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ జేఎస్‌డబ్ల్యూ గ్రూపే ఇక్కడా ఢిల్లీ టీమ్ ను రూ.810 కోట్లతో సొంతం చేసుకుంది. ఇక లక్నో ఫ్రాంఛైజీని కొత్త సంస్థ క్యాప్రి గ్లోబల్ రూ.757 కోట్లతో దక్కించుకుంది. అంతకుముందు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా వుమెన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ విజయవంతమైన బిడ్ల వివరాలను తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

2008లో జరిగిన తొలి మెన్స్ ఐపీఎల్ రికార్డులను వుమెన్స్ ఐపీఎల్ బ్రేక్ చేసిందని, ఇదో చారిత్రక రోజు అని జై షా ట్వీట్ చేశారు. ఇండియాలో మహిళల క్రికెట్ ఏ స్థాయిలో ఉందో ఈ బిడ్లను చూస్తే అర్థమవుతుంది. ఐదు ఫ్రాంఛైజీలతో కూడిన తొలి మహిళల ఐపీఎల్ మార్చి మొదట్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం